అబిడ్స్, మే 10 : ‘ఉమ్మడి పాలనలో హైదరాబాద్ నగరవాసుల సమస్యలు అన్నీఇన్నీ కావు.. కరెంటు ఎప్పుడుంటదో ఎప్పుడు పోతదో తెల్వక.. మంచినీళ్లు రాక ప్రజలు అరిగోస పడ్డరు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలా సౌకర్యాలు కల్పించిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పదేండ్ల కింది దుస్థితి వచ్చింది. నగరంలో కరెంటు, తాగునీటి సమస్యలు తీవ్రమైనయ్’ అంటున్నారు బీఆర్ఎస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్. ప్రజలు తనను ఆదరించి ఎంపీగా అవకాశమిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని, గోషామహల్ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఉచితంగా విద్యా బోధన అందిస్తానని చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార తీరు, ప్రజాస్పందన, గెలిస్తే తాను చేపట్టబోయే పనులపై వివరించారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా మజ్లిస్‌తో పోటీ ఉంటుంది. ఆ పార్టీ నలభై ఏండ్లుగా నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇటు బీజేపీ అటు మజ్లిస్ రెండు పార్టీలు మతం పేరిట రాజకీయాలు చేస్తున్నయ్. పిల్లల మనసుల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నయ్. విద్య, వైద్యం, ఇతర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి మతం పేరు చెబుతూ పబ్బంగడుపుతున్నయ్. ప్రజల్లో ఆ పార్టీలపై నమ్మకం పోయింది. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్నే గెలిపించేందుకు సిద్ధమైండ్రు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డరు. కరెంట్, మంచినీటి కోసం చాలా తిప్పలు పడ్డరు. బిందెలతో కిలోమీటర్ల కొద్ది వెళ్లి నీళ్లను తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండె. మంచినీటి ట్యాంకర్ వస్తే నీటి కోసం ముష్టి యుద్ధాలే జరిగినయ్. వానలు పడితే బస్తీలు జలమయమయ్యేటివి.తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉండె. డ్రైనేజీలు పొంగిపొర్లి, రోడ్లపై ప్రయాణం చేయలేక అనేక సమస్యలతో సతమతమైండ్రు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నగరాన్ని అన్నివిధాలా బాగు చేసిండు. దేశ విదేశాల పర్యాటకులు పెరిగేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దిండ్రు.
రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం బ్రిడ్జిల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల కోసం పైప్లైన్ల రీమోడలింగ్, వర్షం నీరు సాఫీగా పోయేందుకు నాలాల విస్తరణ, సీఆర్ఎంపీ ద్వారా రహదారుల అభివృద్ధి, నగర మంతటా ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, బస్తీల్లో పేదల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా లెక్కలేనన్ని అభివృద్ధి పనులు చేసిండ్రు. ఇంటింటికి పుష్కలమైన తాగునీటిని అందించి నీటి కొట్లాటలు లేకుండజేసిండు. నిరంతరం కరెంటు సరఫరా చేసి చీకట్లను దూరం చేసిండు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూస్తున్నరు. ఇవన్నీ నా గెలుపు కోసం కలిసివచ్చే అంశాలే.మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నగరాన్ని మళ్లీ పదేండ్ల నాటి ఇబ్బందుల్లో పడేసింది. పాతబస్తీ ప్రజలకు నీటి ఇబ్బందులు మొదలైనయ్.
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని చెబుతున్నారు. కరెంటు మాటిమాటికీ పోతున్నదని, మంచినీళ్లు వస్తలేవని, డ్రైనేజీల నిర్వహణ అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నరు. బీఆర్ఎస్ పాలనే బాగుండేదని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటామని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నరు.
హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ప్రజలు నన్ను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత బాగుచేస్తా. ఇక్కడి ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాటుపడుతా. ఇప్పటికే గోషామహల్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నా. ఈ నియోజకవర్గం నుంచి పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగాలని నా కోరిక. ఆర్థిక సమస్యలతో విద్యకు ఎవరూ దూరం కాకుండా ఉండేందుకు సాయం చేస్తా. ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి విద్యాబోధన అందేలా చూస్తా. పౌర సదుపాయాలను మరింతమెరుగుపరుస్తా. ప్రజల సహకారంతో తప్పక విజయం సాధించి కుల, మతాలు, రాజకీయాలకతీతంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తా.