హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): అమ్మకానికి ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగులతోపాటు దరఖాస్తుదారులు ఈ కథనంపై చర్చించుకుంటున్నారు. ఆ శాఖలో ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. మంత్రి పేషీ అధికారులకు సంబంధంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే, కొందరు దరఖాస్తుదారులు మాత్రం నేరుగా తాము తమ ప్రాంతాల అధికారులను సంప్రదిస్తే.. మంత్రి పేషీలో కలువాలని సూచించారని, అంతేకాకుండా చాలాచోట్ల డబ్బులు ఇచ్చి ఇరుక్కున్నామని వాపోయారు.
వారి పేరు బయటపెడితే నోటికాడబుక్క కొట్టేసినట్లేనని, తమను టార్గెట్ చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానంగా ధూప, దీప, నైవేద్య పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించిన తర్వాత నుంచి అధికారికంగా చేయాల్సిన వ్యవహారం మొత్తం రహస్యంగా చేయడమే కాకుండా, ఎంపికైనవారికి ఉత్తర్వులను గప్‌చుప్‌గా అందజేశారు. దీంతో ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నది.
కేసీఆర్ హయాంలో ధూప, దీప, నైవేద్య పథకం కింద ప్రకటించిన 270 ఆలయాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియపై ప్రస్తుత ప్రభుత్వం మేలో నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3,764 దరఖాస్తులు వచ్చాయి. అందులో 1,327 దరఖాస్తులకు అర్హత ఉన్నట్టు దేవాదాయ శాఖ నియమించిన కమిటీలు నిర్ణయించాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు జాబితాను కమిటీలు జిల్లాల వారీగా పంపించాయి. ఇందులో 270 ఆలయాల ఎంపిక జరగాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు చేసిన సిఫారసులతోపాటు కమిటీ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు తొలి విడతగా ప్రజాప్రతినిధులు చేసిన సిఫారసుల్లో 169 ఆలయాలను ఎంపిక చేసి వాటికి సంబంధించిన ఉత్తర్వులను ఎవరికి వారికి వ్యక్తిగతంగా అందజేశారు. దీంతో దరఖాస్తుదారులు చాలామంది దేవాదాయ శాఖ కార్యాలయం చుట్టూ తమకు రాలేదంటూ తిరిగారు. కానీ, ఆ శాఖ వద్ద కూడా పూర్తిస్థాయిలో సమాచారం లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది.
చివరకు ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతో దేవాదాయ శాఖ అధికారులు స్పష్టమైన సమాచారమిచ్చారు. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు సిఫారసు చేసినవి 486 ఆలయాలు కాగా, అందులో 198 ఆలయాలకు అర్హత ఉన్నదని, వాటినుంచి 169 ఆలయాలను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. మిగతా 101 ఆలయాలకు రెండో విడతలో జాబితా విడుదల చేస్తామని, ఈమేరకు కసరత్తు జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఎంపిక చేసినవాటిలో 270 ఆలయాలు పోగా, అర్హత ఉన్న మిగతా 1,057 ఆలయాలను కూడా ఎంపిక చేసి ప్రతినెలా డబ్బులు చెల్లిస్తే సుమారు రూ.12.68 కోట్ల భారం పడుతుందని పేర్కొంటూ ఒక నివేదికను మంత్రి కొండా సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించారు. దీనిపై ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోవలసి ఉన్నదని మంత్రి పేషీ అధికారులు తెలిపారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధూప, దీప, నైవేద్య పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలు 5,700కుపైగా ఉండటంతో వాటి నిర్వహణ విషయంలో చాలా ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ వీటి నిర్వహణపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలంటూ ఆ శాఖకు లేఖ కూడా రాసినట్లు సమాచారం. డీడీఎన్ ఆలయాల విషయంలో వివిధ సంఘాల ప్రతినిధులు తమ బినామీలతో నడుపుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని, అంతేకాకుండా కొన్ని ఆలయాల పేరు మీద డబ్బులు తీసుకుని వాటి నిర్వహణను గాలికి వదిలేసినట్టు తమ దృష్టికి రావడంతో విచారణ జరపడానికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
ధూప, దీప, నైవేద్య పథకంలో ఆలయాల ఎంపికకు డబ్బులు తీసుకుంటున్నారంటూ వచ్చిన కథనం, బయట జరుగుతున్న కొన్ని ఘటనల వ్యవహారంపై మంత్రి పేషీ అధికారులు స్పందించారు. తాము ఈ పథకానికి సంబంధించి ఆలయాల ఎంపిక విషయంలో జోక్యం చేసుకోలేదని, మంత్రి ఎలా చెప్తే అలా చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సిఫారసులకు సంబంధించిన జాబితా తయారుచేశామని, అందులో వారు చెప్పిన ఆలయాలు కొన్ని ఎంపిక కాలేదని, మరికొందరు చెప్పిన వాటికి అసలు దరఖాస్తే చేసుకోలేదని మంత్రి సురేఖ పీఎస్ సోమరాజు చెప్పారు. ఈ విషయంలో తాము డబ్బులు తీసుకోవలసిన అవసరమే లేదని వివరించారు. ఆలయాల వైభవానికి తమ వంతుగా సహకరిస్తాం తప్ప, అర్చకుల వద్ద డబ్బులు తీసుకున్నామని ప్రచారం బాధాకరమన్నారు.