హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సమాజంలో వివాదాలను, సంఘర్షణలను సానుకూల చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని, ఇది స్వపరిపాలనకు నాంది పలుకుతుందని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. ఇదే అంశంపై క్షేత్రఫౌండేషన్తో నల్సార్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా పరస్పర సహకారం, చర్చలు, విద్య, అవగాహనకు సంబంధించిన ప్రాజెక్టుపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. అనంతరం వీసీ మాట్లాడుతూ.. సామాజిక సముదాయాల్లో సమస్యల పరిష్కారానికి ఒక సమగ్ర పద్ధతి అవసరం అనే అవగాహన నుంచే తమ కొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకున్నదని తెలిపారు. క్షేత్ర ఫౌండేషన్ సీఈవో డాక్టర్ కృష్ణ ఉదయశంకర్ మాట్లాడుతూ.. నల్సార్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో రోహిణి నీలేకని, నటాషా జోషి పలువురు పాల్గొన్నారు.