నల్లగొండ, జూలై 6: మహారాష్ట్రకు చెందిన అత్యంత క్రూరమైన పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పార్థీ గ్యాంగ్ కొంతకాలంగా నల్లగొండ జిల్లాలోని చిట్యాల, నారట్పల్లి, కట్టంగూర్ మండలాలతోపాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి జిల్లాలో ఎన్హెచ్-65పై వాహనాలు ఆపి నిద్రపోతున్న వారిని రాళ్లతో కొట్టి వారి నుంచి బంగారం, డబ్బులు దొంగలించడంతోపాటు పలు నేరాలు చేసింది.
ఈ ఏడాది మే 18న ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొల్లూరు రాజవర్ధన్ కట్టంగూర్ మండల పరిధిలో మినీ గూడ్స్ వాహనంలో పడుకోగా ఆయన కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి, స్రూడ్రైవర్తో పొడిచి చంపి రూ.14,500 దొంగలించారు. దారిలో పామనుగుండ్ల గ్రామంలో షైన్ బైక్ను దొంగలించి ఆ తర్వాత ఇంటి ఆవరణ ఆరుబయట పడుకున్న పలువురి మెడలో బంగారు ఆభరణాలు అపహరించారు. వీరి మీద రాష్ట్రంలో మొత్తం 32 కేసులు ఉన్నాయి.