నల్లగొండ ప్రతినిధి, మార్చి13(నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై బడ్జెట్ సమావేశాల సెషన్ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు గురువారం ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ సెంటర్లో నల్లజెండాలు, బ్యాడ్జీలతో ర్యాలీ తీసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
హాలియాలో ర్యాలీ తీశారు. సాగర్ క్రాస్ రోడ్స్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిరసన ర్యాలీ తీశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగదీశ్‌రెడ్డి స్వగ్రామం నాగారం మండలం కేంద్రంలోనూ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అర్వపల్లి, తుంగతుర్తి, మోత్కూరులోనూ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.