చండూరు, డిసెంబర్7: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరుతూ శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం రైతులు రాస్తారోకో నిర్వహించారు. సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూరైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
మధిర రూరల్, డిసెంబర్ 7 : రైతులందరికీ ఉత్తుత్తి రుణమాఫీ కాకుండా.. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారం గ్రామంలో శనివారం నిర్వహించిన సీపీఎం మధిర డివిజన్ మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఎన్నికలకు ముందు సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలు చేయకుండా మాయమాటలతో కాలం గడుపుతున్నదని విమర్శించారు. ఉద్యమాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, పేద, మధ్యతరగతి, కర్షకుల పక్షాన సీపీఎం పోరాడుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.