నీలగిరి, జూన్ 26: నల్లగొండ పట్టణ శివారు సాగర్రోడ్డులోని తెలంగాణకాలనీలో సంచలనం సృష్టించిన నాలుగు హత్యలు ఒక్కడే చేశాడని ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. నిందితుడితోపాటు సహకరించిన భార్య, స్నేహితుడు, బంగారు వ్యాపారిని అరెస్టు చేసి వారినుంచి కారు, నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్ ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారు ముద్ద, భూమి, బ్యాంక్‌కు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు ఎస్పీ వెల్లడించారు. నల్లగొండ శివారు సాగర్రోడ్డులోని తెలంగాణకాలనీలో ఈ నెల 22న మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు చేరుకుని మృతులు సుల్తాన్ (45), అతడి భార్య హసీనా (41) ముజమ్మిల్ (20), అఫూరా (12)గా గుర్తించి క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులను నారట్ పల్లి ఫ్లై ఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని, విచారించగా నేరం అంగీకరించారు. నిందితుడు ఒక్కడే నలుగురిని హత్యచేసిన తరువాత తన స్నేహితుడు సోహెల్ సహాయంతో బంగారు ఆభరణాలను దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ బాలాజీ జ్యువెలర్స్ యజమాని హేమంత్‌కుమార్ వద్ద తాకట్టు పెట్టి రూ. 5.3 లక్షలు తీసుకున్నారు. నిందితుడు సయ్యద్ అస్లాం కారు డ్రైవర్‌గా పని చేస్తూ, భార్య తబస్సుంతో కలిసి గండిపేటలో ఉంటున్నాడు. తబస్సుం తల్లి తహేరా బేగం చెల్లెలు హసీనా (మృతురాలు) దగ్గర ఏడాది క్రితం అస్లాం రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల కొత్త కారు కొనుగోలు చేయడానికి మరో రూ.లక్ష అప్పు ఇవ్వాలని హసీనాను అడిగారు. దీనికి హసీనా నిరాకరించి.. పాత బాకీ వెంటనే ఇవ్వాలని ఒత్తిడి చేసింది. దీనిపై అస్లాం, తబస్సుం హసీనా కూతురు బుష్రాను సంప్రదించారు. ఆమె కూడా తన తల్లి (హసీనా) తనకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయడంలేదని, మొత్తం సుల్తాన్ పిల్లలైన ముజమ్మిల్, అఫూరాలకే పెడుతున్నదని, ఇంట్లో చాలా డబ్బు, బంగారం ఉన్నాయని సమాచారం ఇచ్చింది. 2013లో హసీనా మొదటి భర్త సుజాత్ పెట్టిన కేసులో తబస్సుం తల్లి తహేరా బేగం జైలుకు వెళ్లడానికి హసీనానే కారణమనే పాత కక్ష కూడా ఉంది. దీంతో హసీనా ఇంట్లో దొంగతనం చేయమని తబస్సుం తన భర్త అస్లాంకు సూచించింది.
ఇటీవల హసీనా కొత్త ఇల్లు కొనేందుకు బ్యాంకులో రూ.2. 25 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని, ఇంట్లో 10 తులాల బంగారం, నగదు ఉన్నట్లు అస్లాం దంపతులు తెలుసుకున్నారు. హసీనాను చంపితేనే ఆమె ఒంటిపై ఉన్న బంగారం దొరుకుతుందని పథకం వేశారు. ఇందుకోసం అస్లాం యూట్యూబ్‌లో హత్యలకు సంబంధించిన వీడియోలు చూసి పకా సెచ్ వేశాడు. అస్లాం ఈ నెల 19న రాత్రి గండిపేట నుంచి కారులో నల్లగొండకు చేరుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హసీనా ఇంటి తలుపు తీసుకుని బయటకు రాగానే, గుమ్మం దగ్గర దాకున్న అస్లాం ఒకసారిగా ఆమె మెడపై కత్తితో దాడిచేశాడు.
కేకలు విని బయటకు వచ్చిన సుల్తాన్ మెడపై కూడా కత్తితో దాడి చేశాడు. నిద్రలేచి భయంతో పారిపోతున్న ముజమ్మిల్‌ను నరికి చంపాడు. బెడ్రూమ్లో ఉన్న సుల్తాన్ చిన్న కుమార్తె అఫూరా మెడపై కత్తితో పొడిచి చంపేశాడు. నలుగురూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బీరువాలోని 5 తులాల బంగారు ఆభరణాలు, ల్యాండ్, బ్యాంక్ పత్రాలను దొంగిలించాడు. మృతదేహాలపై చద్దర్లు కప్పి, ఇంటి గేటుకు తాళంవేసి హైదరాబాద్ పారిపోయాడు. హత్య కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, టూటౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడి, జితేందర్‌రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.