నీలగిరి, ఫిబ్రవరి 20 : థార్ గ్యాంగ్ లీడర్‌ను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకుట్టు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు మౌరిటెక్ సంస్థ యాజమాని దామోదర్‌రెడ్డి స్థలం అమ్మగా వచ్చిన రూ.25లక్షలు తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్‌లో బయల్దేరాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం బస్సు ఆపారు. వెంకటేశ్వర్లు బస్సు దిగగా, బస్సులో ఉన్న 25లక్షల బ్యాగును దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు మొదలు పెట్టింది. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మధ్యప్రదేశ్‌లోని మన్వర్ తాలుకా కేద్వా జాగీర్‌లోని రాళ్లమండల్కు చెందిన థార్ గ్యాంగ్ నాయకుడు, ప్రధాన నిందితుడు మహ్మద్ అస్రఫ్ ఖాన్ ముల్తానీ షేక్, లైబ్ ఖాన్, అక్రమ్‌ఖాన్, మహబూబ్‌ఖాన్ చోరీ చేసినట్టు గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో మహ్మద్ అస్రఫ్ఖాన్ను పట్టుకున్నారు. నగదుతోపాటు కర్నాటకకు చెందిన ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.