హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలకు అవమానాలు జరగకుండా చూడాలని, తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఖూనీ చేయొద్దని కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. ఎమ్మెల్యేగా తన హక్కులను కాలరాసి, విధులకు ఆటంకపరిచిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం స్పీకర్‌ను కలిసిన ఆయన ప్రొటోకాల్ పాటించని పోలీసు అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆకలినైనా సహిస్తా కానీ అవమానాన్ని భరించబోనని చెప్పారు. ఆగస్టు 30 న భువనగిరిలో ఇరిగేషన్ శాఖ సమీక్షకు వచ్చి న మంత్రి ఉత్తమ్‌ను కలిసేందుకు పోలీసులు తనను అనుమతించలేదని తెలిపారు. ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. వారిని పిలిచి వి చారిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను వదిలేసి కానిస్టేబుళ్లకే నోటీసులు ఇస్తున్నారని, దీనిని ఖండిస్తున్నట్టు ఎమ్మెల్యే వీరేశం తెలిపారు.
కరీంనగర్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భువనగిరిలో దళిత ఎమ్మె ల్యే వేముల వీరేశం(నకిరేకల్)కు పోలీసుల వల్ల జరిగిన ఘోర అవమానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మానకొండూర్ ఎమ్మె ల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రకటనలో తెలిపారు. దురహంకార పోకడలు ఉన్న పోలీసు అధికారులు అక్కడక్కడా ఉన్నారని, కరీంనగర్ సీపీ కూడా ఇదే తరహా పోకడలను అనుసరిస్తున్నారని ఆరోపించారు. మానకొండూర్ సీఐ పోస్టు ఖాళీగా ఉండడంతో సీఎం సహకారంతో నియమిస్తే దాన్ని కరీంనగర్ సీపీ రద్దు చేశారని వాపోయా రు. అయినా పోస్టిం గ్ తెచ్చుకున్న సీఐని, తాను కాదన్నా ఎలా పోస్టింగ్ తెచ్చుకున్నావంటూ సీపీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే ఇంకో దళిత అధికారికి సీఐ పోస్టింగ్ వేయిస్తారా..? అనే చిన్నచూపు, దురహంకారమే సీపీ అభ్యంతరానికి కారణమని వాపోయారు. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు.