Chirumarthi Lingaiah | రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద అధికారం లోకి వచ్చిందని, పాలనలో కూడా అబద్ధాల పరంపరే కొనసాగిస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కోతలు, తర్వాత ఎగవేతలకు పాల్పడుతున్నారని సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినంక ప్రజల నుంచి దరఖాస్తులే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది కిందట ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టి.. తర్వాత కులగణన దరఖాస్తులు పెట్టించిండని పేర్కొన్నారు. ఇప్పుడా దరఖాస్తులన్నీ చెత్త కుండీల పాలయ్యాయని ఆరోపించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎలాంటి దరఖాస్తులు లేకుండా సంక్షేమ పథకాలు అందజేశారని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. 11 విడుతల్లో రైతు బంధు కింద రూ.73 వేల కోట్లు పంపిణీ చేశారని చెప్పారు. ఇక 13 లక్షల మందికి మహిళలకు కల్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు.
ఏ దరఖాస్తులు లేకుండా 57 ఏండ్లకే వృద్ధులకు ఆసరా పింఛన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డికి పాలన చేతకాదని చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం తీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతుందన్నారు.
పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామసభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటని చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు.
రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్… అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడుకుంటే ఏం చేస్తారని చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారిందని, సమాధానం చెప్పలేని పరిస్థితిలో చిక్కుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దగా ప్రజలకు అర్థం అర్థమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దాని ప్రస్తావనే లేకుండా చేశారని ఆరోపించారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే స్వయంగా కేసీఆర్ నిర్వహించిన సర్వేనే బాగుందన్నారు. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీల అమలు చేసేవరకు బీఆర్ఎస్ నిలదీస్తుందన్నారు.