నాగర్‌కర్నూల్, మే 17 : ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వేధింపుల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి భార్య ఆరోపించారు. స్థానికుల కథనం ప్రకారం.. తెలకపల్లికి చెందిన వెంకటయ్య (45)కు భార్య అలివేలుతోపాటు కూతురు ఉన్నది. ఈయన ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడ్రోజుల కిందట మండల కేంద్రంలో ఆటో ఎక్కిన ఓ మహిళ బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో విచారణ కోసమంటూ వెంకటయ్యను పోలీసులు స్థానిక స్టేషన్‌కు పిలిపించారు. బంగారం గురించి అడుగుతూ తీవ్రంగా కొట్టి విడిచిపెట్టారు. మళ్లా శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. దీంతో భార్యకు ఫోన్ చేసి తాను ఏ తప్పు చేయలేదని.. పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని బాధపడ్డాడు. తర్వాత పట్టణ సమీపంలోని పెద్ద చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.