హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల విడుదలకు సంబంధించిన గణాంకాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు సరిగా పనిచేయకపోవడంతో ప్రత్యేకంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ).. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టునే అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని గతంలోనే నిర్ణయించింది. కానీ, ఈ విషయంలో ఏపీ అతితెలివి ప్రదర్శిస్తున్నది. బోర్డు నిర్ణయానికి విరుద్ధంగా టెలిమెట్రీల డాటాను చూపుతున్నది. నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా జూలై 21 నుంచి 31 వరకు విడుదల చేసిన 4.21 టీఎంసీల నీరు పూర్తిస్థాయిలో అందలేదని, అందులో 3.59 టీఎంసీలు మాత్రమే వచ్చాయని వాదిస్తున్నది. టెలిమెట్రీ డాటాను ఉదహరిస్తూ ఇటీవల బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ వాదనను ఖండిస్తూ తాజాగా ఏపీ ఈఎన్సీకి బోర్డు ఓ లేఖను రాసింది. వాస్తవానికి నాగార్జునసాగర్ ఔట్లెట్లపై రెండు దశల్లో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కానీ, ఇప్పటివరకు మొదటి దశ మాత్రమే పూర్తయింది. రెండో దశకు సంబంధించిన ఔట్లెట్లపై టెలిమెట్రీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. అదీగాక మొదటి దశలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో కచ్చితమైన నీటి లెక్కలను సేకరించేందుకు సంబంధిత సెన్సర్లను అనువైన ప్రాంతాలకు మార్చాలని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ గతంలోనే సూచించింది. అప్పటివరకు నీటి వినియోగ లెక్కలను సేకరించేందుకు టెలిమెట్రీల డాటాను కాకుండా ఇరు రాష్ర్టాల అధికారుల ఆధ్వర్యంలోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీ 9వ సమావేశంలో నిర్ణయించారు. బోర్డు ఇదే విషయాన్ని ఏపీ ఈఎన్సీకి వివరించింది. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీకి సూచించింది. ఆ గణాంకాలను ఎప్పటికప్పుడు కేఆర్ఎంబీ వెబ్సైట్లో పొందుపరచాలని ఏపీకి స్పష్టం చేసింది.