కూసుమంచి, సెప్టెంబర్ 21: ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ కాల్వ యూటీ ప్రాంతంలో శనివారం లీకేజీ కావడంతో నీరంతా దిగువకు వెళ్తున్నది. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే నీటి ప్రవాహాన్ని నిలిపివేసి మళ్లీ పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సాగర్ ఎడమ కాల్వకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హట్యాతండా వద్ద ఈ నెల ఒకటో తేదీన గండిపడిన విషయం తెలిసిందే.
దానికి మరమ్మతులు చేసిన అధికారులు శనివారం నుంచి సాగు నీటిని విడుదల చేయాలని ఏర్పాట్లు చేశారు. అయితే క్రాస్ బండ్‌కు సమీపంలో కాల్వ వద్ద ఉన్న యూటీ పక్కన మరమ్మతులు చేశారు. నీటిని విడుదల చేసేందుకు బండ్‌ను తొలగించడంతో రెండు మీటర్ల మేర ఆగి ఉన్న నీరు యూటీ మధ్య వాల్ నుంచి వెళ్లింది. దీంతో లీకేజీ పెద్దగా మారుతుందని భావించిన అధికారులు వెంటనే మళ్లీ బండ్ వేసి నీటిని నిలిపివేశారు. దీంతో నీటి విడుదలకు మరో రోజు బ్రేక్ పడింది. వెంటనే మరమ్మతుల కోసం మళ్లీ పైపులు తెప్పించి సాయంత్రం పనులు మొదలు పెట్టారు.
1975లో కట్టిన యూటీ వాల్స్ పటిష్టత విషయంలో చర్యలు చేపట్టకపోవడం వల్లే మళ్లీ లీకేజీ అయినట్టు తెలుస్తున్నది. కాగా.. యూటీ వద్ద ఉన్న వాల్ 1975లో కట్టడం వల్ల దాని దగ్గరే సమస్య వచ్చిందని, వెంటనే అప్రమత్తమై అడ్డుకట్టు వేసి నీటిని నిలిపివేశామని, ఆదివారం రాత్రి వరకు మళ్లీ నీటిని ఇస్తామని సీఈ విద్యాసాగర్ తెలిపారు. కాల్వకు బుంగ పడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు.