CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో సినీ ప్రముఖులుగా పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అగ్గిమీద గుగ్గిలమైనట్టు తెలుస్తున్నది. వారు నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్షింతలు వేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ తరువాత నేరుగా వచ్చి తమను కలిసి వివరణ ఇవ్వాలని హుకుం జారీచేసినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ విధేయుడు, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సైతం అధిష్ఠానం నుంచి పిలుపువచ్చినట్టు తెలుస్తున్నది.
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ యావత్ సినీతారాలు కాంగ్రెస్‌పై ఒక్కసారిగా భగ్గుమన్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉలిక్కిపడినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డికి నేరుగా ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నెల 6న ఢిల్లీకి వచ్చిన సమయంలో సురేఖ అంశంపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని తెగేసి చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే ఎన్న డూ లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావును పిలుపించుకుని దాదాపు గంటకుపైగా రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. స్పోర్ట్స్ పాలసీ రివ్యూ మీటింగ్‌కు సైతం ఆయనను సీఎం వెంటబెట్టుకుని వెళ్లారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణాలపై అధిష్టానం ఏం చర్చించుకుంటున్నది? అనే అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తున్నది. కొండా సురేఖ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే అధిష్ఠానం శాంతిస్తుంది అని కూడా కేకే నుంచి సలహా తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో రంగంలోకి దిగిన అధిష్ఠానం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫోన్ చేసి వివాదం పెద్దది కాకుండా చూడాలని, మంత్రితో క్షమాపణ చెప్పించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రి సురేఖతో అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నదని మీడియా ముఖంగా క్షమాపణ కోరాలని చెప్పగా, తాను ఇప్పుడు వెనక్కి తగ్గితే ప్రజల్లో పలుచన అవుతానని, ఈ విషయంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని సురేఖ చెప్పినట్టు తెలిసింది. కానీ, అనూహ్యంగా గురువారం ఉదయం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సమంత విషయంలో తాను మాట్లాడింది తప్పేనని ఒప్పుకొన్నారు. ఒక మహిళగా తనకు అవమానం జరిగిందని చెప్పే క్రమంలో భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టాయని గుర్తించానని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నానని ప్రకటించారు.
కేవలం సమంత విషయంలో తప్పు మాట్లాడినట్టు చెప్పడంతో నాగార్జునకు పుండు మీది కారం చల్లినట్టయింది. శుక్రవారం టైమ్స్‌నౌ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సురేఖ క్షమాపణ చెప్తే మీరు అంగీకరిస్తారా? అని జర్నలిస్టు ప్రశ్నించగా.. ఆ సమయం దాటిపోయిందిన తేల్చిచెప్పారు. ఏదైనా కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతుండటంపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నాగార్జునతో రాజీకి కాంగ్రెస్ నేతలు మంతనాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ రాజీ కుదిరితే కేసు వాపసు తీసుకోవాలా వద్దా అన్న మీమాంశ కొనసాగుతుంది. సెక్షన్ 356 బీఎన్ఎస్ ప్రకారం మూడేండ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో రాజీ చేసుకునే వీలుంటుందని నిపుణులు అంటున్నారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కినేని అమల నేరుగా ఈ విషయాన్ని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను అంగీకరిస్తున్నారా? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ప్రియాంకగాంధీ నేరుగా అక్కినేని అమలకు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నామని, దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై వేటు తప్పదనే ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.
మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సైతం అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ అంశంపై ఆయనను ఆరా తీసినట్టు విశ్వసనీయ సమాచారం. ఉత్తమ్ తండ్రి ఇటీవలనే మృతిచెందిన నేపథ్యంలో ఆయన కర్మకాండల క్రియలు ముగిసిన అనంతరం నేరుగా ఢిల్లీకి రావాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇంత హడావుడిగా మంత్రి ఉత్తమ్‌ను ఢిల్లీకి పిలిపించడంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన సినీ నటుడు అక్కినేని నాగార్జున వాంగ్మూలం నమోదుకు కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. నాగార్జున వాంగ్మూలాన్ని శనివారం నమోదు చేసే అవకాశాలున్నట్టు సమాచారం. కోర్టు ప్రొసీడింగ్ ఆఫీసర్ (మెజిస్ట్రేట్) శుక్రవారం సెలవుపై ఉండటంతో శనివారం వాంగ్మూలం నమోదుకు కోర్టు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, వేంకటేశ్వర్లు కూడా తమ వాంగ్మూలాల్ని నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో సాక్ష్యాధారాలుగా పెన్‌డ్రైవ్, సీడీలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు చెందిన వీడియోలు కోర్టుకు సమర్పించారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం కేసు నమోదుకు కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖకు లంగర్‌హౌజ్ పోలీసులు సమన్లు జారీ చేసిన పిదప కోర్టు విచారణ చేపట్టనుంది.