హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని అనధికారిక నిర్మాణాలను శనివారం హైడ్రా కూల్చేసింది. తెల్లవారుజామున పోలీసుల బందోబస్తుతో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో, భారీ యంత్రాలతో హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. తమ్మిడికుంట చెరువుకు ఆనుకొని నిర్మించిన మరో రెండు షెడ్లను సైతం హైడ్రా కూల్చేసింది. ఎన్ కన్వెన్షన్‌లోని అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దానిలో పలు కీలక అంశాలను ఆయన పేర్కొన్నారు.
ఖానామెట్ గ్రామ పరిధిలోని తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ (పుల్ట్యాంక్లెవల్) పరిధిలో ఒక ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2.18 ఎకరాల స్థలంలో అనధికారికంగా నిర్మాణాలు చేశారని, దీనిపై ఫిర్యాదులు రావడంతో కూల్చేసినట్టు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. 2014లో హెచ్ఎండీఏ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, 2016లో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఎన్ కన్వెన్షన్ యజమాన్యం హైకోర్టుకు వెళ్లిందని, చట్టప్రకారం నడుచుకోవాలని, ఎఫ్టీఎల్ నిబంధనలను పాటించాలంటూ ఆనాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ సర్వే పూర్తిచేసి, ఆ నివేదికను ఎన్ కన్వెన్షన్ యజమాన్యానికి అధికారులు అందించారని తెలిపారు. అనంతరం కన్వెన్షన్ యజమాన్యం మియాపూర్ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు ఆ కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. ఇది తప్పా.. ఏ కోర్టు కూడా స్టే ఆర్డర్లు ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ అనుమతులు లేవు
ఎన్ కన్వెన్షన్ యజమాన్యం నిబంధనలు ఉల్లంఘించి 3.30 ఎకరాల్లో చేపట్టిన అనధికార నిర్మాణాలకు జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇదే యజమాన్యం బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీమ్ (బీఆర్ఎస్)లోనూ తమ నిర్మాణాల రెగ్యులరైజ్‌కు ప్రయత్నించగా, అది తిరస్కరణకు గురయ్యిందని పేర్కొన్నారు. తమ్మిడికుంట చెరువుకు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని నాలాలు అనుసంధానమై ఉన్నాయని, హైటెక్ సిటీ ప్రాంతంలో వరదనీరు నిలిచే సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిపారు. ఒక పక్క చెరువు కబ్జాకు గురికావడంతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం 50 నుంచి 60 శాతం వరకు కుచించుకుపోయిందని, దీంతో భారీ వర్షాలు పడిన సమయంలో తమ్మిడికుంట చెరువు దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లు నీటిలో మునిగిపోతూ తీవ్ర ఆస్తి నష్టానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే నిర్ణీత ప్రక్రియను అనుసరించి నీటిపారుదల, టౌన్‌ఫ్లానింగ్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి తమ్మిడికుంట చెరువులో అనధికారిక నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశామని రంగనాథ్ చెప్పారు. తెలంగాణ హైకోర్టు శనివారం మధ్యాహ్నం ఈ కూల్చివేతలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటనతో వచ్చే నెల వరకు వివాహ, ఇతర ఫంక్షన్ల నిర్వహణకు ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసుకున్న నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందజేసిన వారు మరో ఫంక్షన్‌హాల్ కోసం వెతుకులాటలో పడ్డారు.
అంగుళం భూమినీ ఆక్రమించలేదు!
కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కట్టడాలను కూల్చివేయడం బాధాకరమని ఎన్ కన్వెన్షన్ యజమాని, సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అది పూర్తిగా ప్రైవేటు భూమి అని, అంగుళం కూడా చెరువు భూమిని తాము ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నదని, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చర్యపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ నిర్మాణ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా మంజూరు చేసిందని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని మండిపడ్డారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు కూడా జారీ చేయలేదని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఒకవేళ కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే స్వయంగా నిర్మాణాలను కూల్చివేసేవాడినని తెలిపారు. కానీ ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుండగా, మరోవైపు స్టే ఉండగా అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.