హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో కోతలను చూసి తట్టుకోలేకపొయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ శరణుజొచ్చారు. న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని అవమానించేలా మాట్లాడారు. ‘మీరు వరి ఎందుకు వేస్తున్నరు? ధాన్యం కొనే పరిస్థితిలేదు. ధాన్యం పేరుతో చెత్త తీసుకొచ్చి పెడుతున్నరు’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కోడేరు మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన రైతులు బచ్చన్న, వీరపాగ కృష్ణ, నారాయణ, శివ, ఈశ్వర్వమ్మ ఐకేపీ కేంద్రంలో తూకం వేసి 887 ధాన్యం బస్తాలను కొండారెడ్డిపల్లిలోని విఘ్నేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ ట్రక్షీట్లో 28 బస్తాలకు కోతపెట్టి 859 బస్తాలను మాత్రమే లెక్క చూపారు.
తేమ, తాలు పేరుతో సుమారు 11.2 క్వింటాళ్ల ధాన్యానికి కోత పెట్టారు. తద్వారా రైతులకు రూ. 25,760 నష్టం వాటిల్లింది. ఇది కాకుండా అప్పటికే ఐకేపీ కేంద్రంలో బస్తాకు దాదాపు 4 కేజీలు అదనంగా తూకం వేసినట్లు రైతులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక బస్తాకు 40 కేజీలు తూకం వేయాలి. కానీ ఐకేపీ కేంద్రంలో 44 కేజీల తూకం వేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు మళ్లీ 28 బస్తాలు కోత పెట్టారు. దీంతో కడుపు రగిలిపోయిన రైతులు దీనిపై నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే ఈ నెల 9న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి వెళ్లిన ఆ రైతులు కలెక్టర్ బదావత్ సంతోష్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తొలుత బాగానే స్పందించిన కలెక్టర్, అధికారులతో మాట్లాడిన తర్వాత తిరిగి తమపైనే మండిపడ్డారని రైతులు తెలిపారు. ‘వరి ఎందుకేస్తున్నరు. ఇక్కడ వడ్లు తీసుకునే పరిస్థితి లేదు. దేశంలో వడ్లు ఎక్కువైపోయాయి. మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు వేసుకోండి’ అని తమను గద్దించినట్టు చెప్తూ వాపోయారు.
తాలు గురించి మాట్లాడుతూ ‘అంతా చెత్త తెస్తున్నారు’ అని తమను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. ధాన్యంలో కోతలేకుండా చూసుకోవాలని కోరగా, ‘చూసి కట్చేస్తరులే’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి అక్కడి నుంచి పంపించివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కోతల వల్ల తమకు రూ. 28 వేల నష్టం వచ్చిందని రైతు బచ్చన్న ‘నమస్తే తెలంగాణ’కు తెలిపాడు.