నాగర్‌కర్నూల్, నవంబర్ 13 : ప్రాజెక్టుల పనుల్లో అవినీతికి పాల్పడుతున్న మేఘా సంస్థను వెంటనే సీజ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మేఘా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రూ.5 వేల కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మేఘా కంపెనీకే తిరిగి నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్యాకేజీ పనులను ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఏదో చేస్తారని ప్రజలు నమ్మారని, కానీ ప్రాజెక్టుల విషయంలోనే మీ పనితనం బయటపడిందని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికపై గత నెలలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లేఖల ద్వారా ఫిర్యాదు చేసినట్టు సదరు ప్రతులను మీడియాకు చూపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో స్పీడ్ పోస్టులు, రిజిస్టర్డ్ లెటర్స్, పార్సిళ్లు పంపించే సమయాన్ని పొడిగించినట్టు చీఫ్ పోస్ట్‌మాస్టర్ ప్రకటించారు. వినియోగదారుల సౌకర్యార్థం పార్సిల్ బుకింగ్స్ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆఫీస్ పనివేళలు పూర్తయిన తర్వాత కూడా 4కేజీల బరువు వరకు గల పార్సిళ్లను పంపించేందుకు హైదరాబాద్ జీపీవోలో రోజంతా అనుమతిస్తామని తెలిపారు.