నమ్ముకున్న పార్టీ అన్యాయం చేస్తే ఆవేదన చెందుతున్న నాయకులకు బీఆర్ఎస్ ఓ భరోసాగా కనిపిస్తున్నది. ధనబలం ఉన్నవారికే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడంతో ప్రజాబలం ఉన్న నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముదిరాజ్ నేతలు ఎర్ర చంద్రశేఖర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.

Nagam Janardhan Reddy | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో డబ్బులున్న వారికి, కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలతో తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని ఆదివారం ప్రకటించారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని రేవంత్‌ను ప్రశ్నిస్తే సునీల్ కనుగోలు టీం సర్వే ఆధారంగా అభ్యర్థిని ప్రకటించామని చెప్పారని వాపోయారు. నాగర్‌కర్నూల్ భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నట్టు స్పష్టంచేశారు. మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.

నాగం జనార్దన్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి రావాల్సిందిగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. నాగం.. పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచన మేరకు నాగం జనార్దన్‌రెడ్డిని, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చామని చెప్పారు. సీఎం కేసీఆర్‌తో జనార్దన్‌రెడ్డికి నాలుగు దశాబ్దాలకు పైగా సాన్నిహిత్యం ఉన్నదని గుర్తుచేశారు. నాగం బీఆర్ఎస్లోకి రావడం అంటే ఇద్దరూ చిరకాల మిత్రులు కలిసి నడిచినట్టుగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. వీరి భేటీ అనంతరం నాగం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు.
