కొల్లాపూర్, నవంబర్ 16: ఏపీ ప్రభుత్వం 450 టీఎంసీలను తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తున్నదని… ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) పెండింగ్ పనులను శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణానది జలాలపై 69 శాతం తెలంగాణకు హక్కు ఉన్నా వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
పీఆర్ఎల్ఐ నిలిచిపోయిన పనులను చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. కుడికిళ్ల నుంచి తీర్నాంపల్లి వరకు 3.5 కిలోమీటర్ల మేర పెండింగ్ ఉన్న కాల్వ పనులు పూర్తి చేస్తే ఉద్ధండాపూర్ రిజర్వాయర్ వరకు నీళ్లను తీసుకెళ్లే వీలుంటుందని చెప్పారు. 50 టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వ వైఫల్యంతో యాసంగిలో సాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయని చెప్పారు. పాలమూరు జిల్లావాసి అయిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జన్మధన్యం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టు పెండింగ్ పనులపై చర్చించేందుకు ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమని చెప్పారు.