సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కార్యకర్తల అభిప్రాయాల మేరకు రెండురోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు. నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన తాజాగా నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ శ్రేణులతో బుధవారం సమావేశమయ్యారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి చౌరస్తాలోని అరుణ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో నాగం తీవ్రస్థాయిలో మాట్లాడారు.
ఉదయ్‌పూర్ తీర్మానానికి వ్యతిరేకంగా నాగర్‌కర్నూల్ టికెట్‌ను కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డికి ఇచ్చారని ధ్వజమెత్తారు. ఆ తీర్మానం ప్రకారం ఐదేండ్లు పార్టీ సభ్యత్వం ఉండాల్సి ఉండగా, రాజేశ్వర్‌రెడ్డికి కనీసం ఐదు రోజుల సభ్యత్వం కూడా లేదని చెప్పారు. అర్హత లేని వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం తనకు కారణం చెప్పకుండా రేవంత్‌రెడ్డి మొహం చాటేస్తున్నాడని ఆరోపించారు. కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.