చందుర్తి, డిసెంబర్ 19 : పేద కుటుంబమే అయినా ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించాడు. ఉన్నత చదువులు చదివినా అవకాశాలు లేక హమాలీగా పనిచేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్-3 జాబ్ కొట్టాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన పెరుక అజయ్ తండ్రి శ్రీనివాస్ గల్ఫ్‌బాట పట్టగా, తల్లి లక్ష్మి బీడీలు చుడుతూ కుటుంబ భారం మోసేది. అన్న జూనియర్ లెక్చరర్ జాబ్ సాధించగా, ఎంఏ ఎకనమిక్స్ చదివిన అజయ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవకాశాలు రాక కొంతకాలం గ్రామం లో హమాలీ పనిచేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు 2022లో గ్రూప్-3 నోటిఫికేషన్ రావడంతో తండ్రి శ్రీనివాస్, స్నేహితుడు గుర్రం శ్రీకాంత్ ప్రో త్సాహంతో ప్రిపేర్ అయ్యాడు. 2024 నవంబర్‌లో పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూశాడు. గురువారం గ్రూప్-3 ఫలితాలను వెల్లడించగా, హోం డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు.