ఎల్కతుర్తి, నవంబర్ 8: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ శివారులో వందలాది నాటు కోళ్లు దొరికాయి. ఎవరు వదిలారో తెలియదు కానీ శనివారం తెల్లవారుజామున దాదాపు వెయ్యికిపైగా కోళ్లు పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన స్థానికులు అందినకాడికి పట్టుకెళ్లారు. వివరాలు ఇలా.. ఇందిరానగర్ సమీపంలో హుస్నాబాద్-ఎల్కతుర్తి ప్రధాన రహదారి పక్కన శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వెయ్యికిపైగా నాటు కోళ్లను వదిలివెళ్లారు. అప్పుడే తెల్లవారుతుండటంతో అటుగా వచ్చిన వాహనదారులు, స్థానికులు రోడ్ల వెంబడి ఉన్న నాటు కోళ్లను గుర్తించారు.
వాహనాలు ఆపుకొని కోళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అవి భయంతో పక్కనే ఉన్న పత్తి, వరి పొలాల్లోకి పరిగెత్తాయి. విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కోళ్లను పట్టుకున్నారు. కొందరికి రెండు, మూడు కోళ్లు చొప్పున కోళ్లు దొరికాయి. దీంతో ఎల్కతుర్తి-హుస్నాబాద్ ప్రధాన రహదారిలోని ఇందిరానగర్ సమీపంలో జనాలు ఎగబడటంతో అక్కడి వాతావరణం జాతరను తలపించింది. ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే దాదాపు కోళ్లన్నీ మాయమయ్యాయి.