నీలగిరి, జూన్ 25: ఒకే కుటుంబంలోని నలుగురు హత్యకు గురైన ఘటన నల్లగొండ పట్టణ శివారులో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆస్తి కోసమే హసీనా కూతురు, అల్లుడు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న హసీనాకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో భార్య చనిపోయి ఇద్దరు పిల్లలతో ఉన్న సుల్తాన్‌కు ఇచ్చి మూడో వివాహం జరిపించారు.
సుల్తాన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి హసీనాతో పట్టణ శివారులో నివాసం ఉంటూ పనిచేస్తున్నారు. కాగా, హసీనాకు గతంలో మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. భర్తకు వారసత్వంగా 1.10 ఎకరాలు రావడం తో హసీనా పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. వారికి బుష్రాబతుల్ జన్మించింది. అనంతరం కుటుంబంలో వివాదాలు రావడంతో విడాకు లు తీసుకున్నారు. కానీ వ్యవసాయ భూమి మాత్రం హసీనా పేరునే ఉన్నది.
విడాకుల సమయంలో మొదటి భర్త కొంత నగదు సైతం హసీనాకు ఇచ్చాడు. హసీనా కుమార్తె బుష్రాబతుల్ వివాహ సమయంలో వ్యవసా య భూమి ఇవ్వాలని కోరగా, అందుకు హసీ నా అంగీకరించలేదు. అప్పటి నుంచి ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి. హసీనా కూతురు బుష్రాబతుల్, అల్లుడు అర్హన్ అతని అక్కతో కలిసి ఉత్తరప్రదేశ్‌కు చెందిన కిరాయి హంతకులకు రూ.20 లక్షలు సుపారీ ఇచ్చి నలుగురిని మట్టుబెట్టినట్టు తెలిసింది. పోలీసులు సెల్‌ఫోన్ సీడీఆర్ ఆధారంగా నేరస్తులను గుర్తించారు. బుష్రాబతుల్, అర్హన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, హత్య చేసిన నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచా రం. వారి కోసం పోలీసులు రెండు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిసింది.