హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఏకంగా సచివాలయంలోనే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సిద్దిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేశారు. ‘ఎన్నటికైనా నా చేతిలోనే చస్తావ్.. ఎప్పుడైనా నేనే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరించారు. సోమవారం పలువురు జర్నలిస్టులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో జర్నలిస్టు శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.. ముఖ్యమంత్రి అక్కడినుంచి వెళ్లిపోగానే శ్రీనివాస్‌రెడ్డి గల్లా పట్టుకుని దుర్భాషలాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీవీ డిబెట్లో పాల్గొన్న శ్రీనివాస్‌రెడ్డి పలు వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేశారు. ఇందులో భాగంగా మెదక్ సీటు విషయంలోనూ విశ్లేషణలు చేశారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే రోహిత్.. ‘నా గురించి ఏం మాట్లాడినవు రా.. ఎన్నటికైనా నా చేతిలోనే చస్తావ్.. ఎప్పుడైనా నేనే నిన్ను చంపేస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు, పోలీసులు జోక్యం చేసుకుని విడిపించారు. మరోసారి సచివాలయంలో కింది అంతస్థులో, పార్కింగ్‌లో మొత్తంగా మూడుసార్లు శ్రీనివాస్‌రెడ్డిని చంపేస్తానంటూ రోహిత్ హెచ్చరించారు. ఈ పరిణామంతో విస్తుపోయిన శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న జర్నలిస్టులంతా శ్రీనివాస్‌రెడ్డిని ఓదార్చి రోహిత్ చర్యను ఖండించారు.