గజ్వేల్, జూన్ 19 : ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాటో తెలియని, రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్‌లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని గజ్వేల్, కొండపాక, వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయమోహన్ మండిపడ్డారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మల్కాజిగిరి, మెదక్ జిల్లాలకు పోవాల్సిన మైనంపల్లి గజ్వేల్‌కు తరుచూ వచ్చి గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడి కార్యకర్తలు ఒక్కసారి తిరగబడితే మరోసారి గజ్వేల్‌లో అడుగుపెట్టరని తెలిపారు. మల్కాజిగిరిలో చెల్లని రూపాయి గజ్వేల్‌లో చెల్లుతుందా అన్ని ప్రశ్నించారు.
ఇక్కడి నాయకత్వం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కోసం బాగా పనిచేస్తున్నదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని ఆగం చేస్తూ.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి అడ్డం పడుతున్న ఆయనపై త్వరలోనే అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లు తగ్గాయో, మల్కాజిగిరిలో మూడో స్థానానికి ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో నామినేటెడ్ పదవుల్లో ఎవరికీ ఒక్కపైసా ఇవ్వలేదని ప్రమాణంచేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్, ఆయా మండలాల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, రాజు, కనకయ్య పాల్గొన్నారు.