పైసలు పట్టుకుని వచ్చే బేహారులు. పూటకో పార్టీ మార్చే బేహారులు. ఏమైనా చేస్తరు. ముంచినా ముంచుతరు. వాళ్లకు నియమం లేదు. సిద్ధాంతం లేదు. నిబద్ధత లేదు. నిన్నొక పార్టీ. ఇయ్యాలొక పార్టీ. రేపొక పార్టీ. కేవలం డబ్బు మదంతోని, అహంకారంతోని ఏదయినా చేయగలుగతం అని భ్రమలో ఉన్నరు.
ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు, సిపాయిలు తెలంగాణ రాకముందు ఎవరి బూట్లు తుడిచారో.. ఎవడేం పనిలో ఉన్నారో తెలుసు. నాడు పక్షిలాగా ఊరూరు తిరిగి, యావత్తు తెలంగాణను ఉద్యమంగా మలిచి, పోరాడి, రాష్ర్టాన్ని సాధించుకున్నా.
ఇన్నేండ్లు మీ బిడ్డగా నేను పోరాటం చేశాను. ఇప్పుడు మీరు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇక కొట్లాడే బాధ్యత మీదే. తెలంగాణను కాపాడుకోవాల్సింది మీరే.
ఒకడు కొడంగల్ రమ్మంటున్నడు. ఒకడు గాంధీ బొమ్మకాడికి రమ్మంటున్నడు. వాళ్లకు ఒక్కటే చెప్తున్న. కేసీఆర్ దమ్ము ఢిల్లీకి తెలుసు. దేశం మొత్తానికి తెలుసు. కర్ణాటక రైతులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నరు. ప్రధాని రాష్ట్రంలో కూడా పూర్తి కరెంటు ఇస్తలేరు. నేను 24 గంటల కరెంటు ఇస్తున్న. ఇది కాదా నా దమ్ము? నా ముందున్న జనం దమ్ము కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము మొత్తం బైలెల్లితే దమ్ము.. దుమ్ము లేస్తది. నవంబర్ 30న ఓట్లతో దుమ్ములేవాలె.. ఆ దుమ్ములో ప్రతిపక్షాలు కొట్టుకుపోవాలె!
– ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ, ధన బేహారులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కే మళ్లీ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ‘కేసీఆర్ నీకు దమ్ముందా? కొడంగల్‌కు వస్తవా? కొడవలి పట్టుకొని వస్తవా? గాంధీ బొమ్మ దగ్గరకొస్తవా అంటుర్రు.. కేసీఆర్ దమ్మేందో ఢిల్లీకి తెలుసు. దేశం మొత్తానికి తెలుసు. నా ముందున్న జనం మొత్తం కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము మొత్తం గట్టిగా బయలెల్లితే.. దుమ్ము.. దుమ్ము లేస్తది. ఆ దుమ్ములో ప్రతిపక్షాలు కొట్టుకుపోవాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ కోతలకు ఇయ్యాల ధర్నాలవుతున్నాయని ఎద్దేవా చేశారు. నేడు సవాళ్లు విసురుతున్నవారు పాలమూరులో గంజికేంద్రాలు పెట్టిననాడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో 24 ఏండ్ల నుంచి తిరుగుతున్నానని, నాడు ఎక్కడెక్కడో పండినోడు ఇయ్యాల వచ్చి సవాళ్లు విసురుతున్నారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘కేసీఆర్ నీకు దమ్మున్నదా? కొడంగల్‌కు రమ్మని అని ఒకడు.. నువ్ గాంధీ బొమ్మకాడికి రమ్మని మరొకడు సవాల్ చేస్తున్నారు. ఇది రాజకీయమైతదా? కేసీఆర్ దమ్మేందో ఢిల్లీకి తెలుసు. దేశం మొత్తానికి తెలుసు. నా ముందున్న జనం మొత్తం కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము మొత్తం గట్టిగా బయలెల్లితే.. దుమ్ము.. దుమ్ము లేస్తుంది. నవంబర్ 30న ఓట్లతో దుమ్ము లేవాలి. ఆ దుమ్ములో ప్రతిపక్షాలు కొట్టుకుపోవాలి. నాడు పక్షిలాగా ఊరూరు తిరిగి, యావత్ తెలంగాణను ఉద్యమంగా మలిచి పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్నం. పాలమూరులో గంజికేంద్రాలు పెట్టిననాడు, కరువుతో గొల్లుమని ఏడ్చుకుంటూ బొంబాయికి వలస పోయిననాడు ఈ కొడుకులు ఒక్కడైనా ఉన్నడా? ఎవడైనా వచ్చిండా? రేపు ఉంటరా?’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులన్నీ పడావు పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. నేడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తిచేయడంవల్ల వనపర్తికి ఒక లక్ష ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ‘వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిని చేసిన మొనగాడు ఎవరు? లేనిపోని ఉల్టాపల్టా మాట్లాడే చిల్లరగాళ్లు ఎవరు? వరిపంటల వనపర్తి చేసినోడు కావాల్నా, చిల్లరగాండ్లు కావాల్నో తేల్చాల్సింది, న్యాయం చెప్పాల్సింది ప్రజలే అని పేర్కొన్నారు. నిరంజన్‌రెడ్డి మంత్రి అయినప్పటికీ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకోసం తనతో పోరాడుతారని తెలిపారు. ‘ప్రాజెక్టును కానివ్వకుండా కాళ్లల్లో కట్టెలు పెట్టి పాలమూరు పథకాన్ని ఏ విధంగా ఆపే ప్రయత్నం చేశారో అందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు పడి ఈ మధ్యనే పాలమూరును కూడా ప్రారంభించుకున్నాం. ఒక్క పంపు పోస్తేనే కల్వకుర్తి కెనాల్ అంత నీళ్లు పోతాయి. అటువంటివి తొమ్మిది పంపులు వస్తాయి. పాలమూరు జిల్లాను కరువు మర్లి చూడదు. గంజి కేంద్రం పెడతామంటే గుంజి కొట్టే పరిస్థితులు వచ్చేలా పనిచేశాం. వలసల జిల్లాను వరిపంటల జిల్లాగా మార్చినం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
పైసలు పట్టుకుని వచ్చే బేహారులు పూటకో పార్టీ మార్చేస్తారు. వాళ్లకు నియమం లేదు. సిద్ధాంతం లేదు. నిబద్ధత లేదు. నిన్నొక పార్టీ. ఇయ్యాలో పార్టీ. రేపొక పార్టీ. కేవలం డబ్బు మదంతోని, అహంకారంతోని ఏదయినా చేయగలుగతమనే భ్రమలో ఉన్నరు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్తేనే రాజకీయ ప్రక్షాళన జరుగతది.
– సీఎం కేసీఆర్
ఎన్నికల్లో ప్రజలు గెలిచే రోజులు రావాలని, అప్పుడే బతుకులు బాగుపడతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెచ్చేటోడు ఉంటే.. వెక్కిరించేటోడు ఉంటడు. ఏం చేసినా కొందరు తిట్టేవాళ్లు ఉంటారు. అలాంటోళ్లను పక్కనపెట్టి, నిజానిజాలు గుర్తించి, ఆలోచించి ప్రజలు ఓటు వేయాలి. ఇంటి సంసారం తీర్చిదిద్దుకున్నట్టు రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నాం. నేడు తెలంగాణ తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో, సాగునీటి రంగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నది. నాడు రెండు పంటలు కలిపినా 60 లక్షల టన్నుల ధాన్యం పండేదికాదు. నేడు 3 కోట్ల టన్నుల వడ్లను పండిస్తున్నాం. ప్రస్తుతం ఏటా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. దానిని 4 కోట్ల టన్నులకు పెంచే ప్రణాళిక వేస్తున్నాం. కరువు జిల్లాగా పేరుపొందిన పాలమూరును సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే’ అని స్పష్టంచేశారు.
తెలంగాణ ప్రజలే తమ రాష్ర్టాన్ని దుష్టుల నుంచి కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘ఇన్నాళ్లూ మీ బిడ్డగా నేను పోరాటం చేసిన. ఇప్పుడు మీరు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెసోళ్లు ఎగేసుకొని వస్తున్నారు. కానీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1969లో సుమారు 400 మందిని పిట్టల్లా కాల్చి చంపారు. వేల మందిని జైళ్లలో పెట్టారు. తెలంగాణ ఒక్క గొంతై నినదించినా వందల మందిని చంపిన తర్వాతకానీ తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వలేదు. దశాబ్దకాలం ఒక కుటుంబంలా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ వస్తే తెలంగాణ ఇప్పుడీ దశకు చేరింది. పచ్చగున్న తెలంగాణపై మళ్లీ కాంగ్రెస్ కన్ను పడింది. కాంగ్రెస్‌కు తెలంగాణ బాగోగులు అవసరం లేదు. తెలంగాణపై పెత్తనం కావాలి. రైతుబంధే రూ.18 వేలకోట్లు ఇస్తున్నాం. అందులో రూ.2 వేల కోైట్లెనా కాజెయ్యొచ్చుకదా? అనే ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు మరొకటి లేదు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే మళ్లీ కైలాసంలో పెద్దపాము మింగినట్టు అయితది’ అని హెచ్చరించారు. భూములపై హక్కులు రైతులకే ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ విధానమని, రైతు భూములపై కాంగ్రెస్‌కు అధికారం ఉండాలనేది ఆ పార్టీ సిద్ధాంతమని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు, నక్కలు చింపిన విస్తరి అయితదని హెచ్చరించారు. ఇక ప్రజల వంతు వచ్చిందని, కొట్లాడే బాధ్యతను ప్రజలే భుజానికెత్తుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు రాంగనే ఎవడుబడితే వాడొచ్చి ఏదేదో చెప్తాడు. ఆగం కావొద్దు. బామ్మర్ది చెప్పిండు, చిన్నయ్య చెప్పిండని ఓటెయ్యొద్దు. ఇంట్లో, బస్తీలో, ఊర్లో చర్చలు పెట్టండి. ఎవరొస్తే తెలంగాణ మంచిగుంటదో ఆలోచించి ఓటెయ్యండి. లేదంటే తెలంగాణ కుకలు, నకలు చింపిన విస్తరి అయితది. అప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. నేను మాత్రం ఎంతకని కొట్లాడాలే. కొట్లాడే బాధ్యత మీది. తెలంగాణ ప్రజల మీదనే కొట్లాడే బాధ్యత పెడుతున్న.
– సీఎం కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు 192 కేసులు వేశారని, అయినా మొక్కవోని దీక్షతో కేసులన్నీ కొలిక్కి తెచ్చామని, త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు. ఉమామహేశ్వర ఎత్తిపోతలను కచ్చితంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఎత్తయిన ప్రాంతాలకు కూడా నీరందించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. లిఫ్ట్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో 1.75 వేల నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి తీరుతామని వెల్లడించారు. అచ్చంపేట నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు కావాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అడిగారని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నెలరోజుల్లో అన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు పోడు పట్టాలిచ్చామని, రాబోయే రోజుల్లో గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలిచ్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నదని వెల్లడించారు. ఎమ్మెల్యే బాలరాజును మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. సుమారు 50 ఏండ్లు దేశాన్ని పరిపాలించింది. దశాబ్దాలపాటు దళితులను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలంలోనే దళితబంధును ప్రారంభించి ఉంటే.. ఇవాళ నా దళిత బిడ్డలందరూ రాజుల్లా ఉండేటోళ్లు. ఈ గతి ఎందుకు ఉండేది? దళితులను దశాబ్దాలపాటు ఈ గతిలో ఉంచిందెవరు? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఎవరూ దళితుల గురించి ఆలోచించలేదు. దళితబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. ఆలోచించండి.. తెలంగాణ సమాజంలో దళితులు, గిరిజనులు, ముస్లింలు, హిందువులు అందరూ బాగుండాలని మనసు నిండా కోరుకున్నది ఎవరు? ఎవరిని బలపరచాలి? ఎవరుంటే లాభం జరుగుతది? అని అందరూ ఆలోచించి ఓటెయ్యండి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకొని వారిని పేదవాళ్లను చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. ‘అల్లాకే ఘర్మే దేర్ హై అంధేర్ నహీ హై’ అని అన్నారు.
పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టిననాడు, గొంతులెండి కిలోమీటర్ల కొద్ది బిందెలు పట్టుకొని నీళ్లకోసం వెళ్లిననాడు, గొల్లుమని ఏడ్చుకుంటూ బొంబాయికి వలసపోయిననాడు ఈ కొడుకులు ఒక్కడైనా ఉన్నడా? ఎవడైనా వచ్చిండా? రేపు ఉంటరా? బహురూపులుగా వచ్చేవారిని తరిమికొట్టండి.
– సీఎం కేసీఆర్
గతంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ, ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలన్నీ 98 శాతం నెరవేర్చామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. చండూరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ‘మునుగోడు కోసం ప్రత్యేకంగా చెప్తున్న. కాంగ్రెస్ 50-60 ఏండ్లు పరిపాలించినా, నడుముగులు వంగిపోయేదాకా, సచ్చిపోయేదాక చూశాయి తప్ప ఫ్లోరైడ్‌ను నివారించలేదు. బీఆర్ఎస్ పార్టీ వచ్చినంకనే ఫ్లోరైడ్ గోస ఏవిధంగా పోయిందో అందరికీ తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు. మరో ఏడాదిన్నరలోగా మునుగోడు నియోజకవర్గంలో సుమారు 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదే. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఉద్యమం నుంచి తన వెంట ఉన్నారని, నిబద్ధత ఉన్న నాయకుడు. ఉప ఎన్నికల్లో ఏ చైతన్యం చూపెట్టారో, ఏ ధన ప్రవాహానికి అడ్డంగా నిలబడి గెలిపించారో రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభాకర్‌రెడ్డిని అలాగే మరోసారి గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ దుర్మార్గులను రానిస్తే రైతుబంధుకు రాంరాం, దళితబంధు జై భీం అయితది. కరెంటు కాట్ల గలుస్తది. తెలంగాణ మళ్లీ మొదటికే వస్తది. అప్పుడు కేసీఆర్‌ను తిట్టినా లాభం ఉండదు.
పైసలు సమస్య కాదని, ప్రజలకు అభివృద్ధి కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘రాజకీయాల్లో పనికిమాలిన వాళ్లు ఉంటారు. డబ్బు మదంతో పనిచేసేవాళ్లు ఉంటారు. వాళ్లకు బుద్ధికి చెప్పకపోతే ప్రజలు గెలవరు.. ఓడిపోతారు. మునుగోడు రాజకీయ చైతన్యమున్న ప్రాంతం. ఈ చైతన్యం మూగబోవద్దు. ఒకనాడు నేనే పాట రాసిన. ఏమాయె నల్లగొండ.. ఏడుపే నీ గుండె నిండా.. నల్లగొండ చైతన్యం, మునుగోడు చైతన్యం చూపాలి. పైసలు పట్టుకుని వచ్చే బేహారులకు నియమం లేదు.. సిద్ధాంతం లేదు.. నిబద్ధత లేదు. నిన్నొక పార్టీ. ఇయ్యాల ఒక పార్టీ. రేపొక పార్టీ. అటువంటి వాళ్లకు బుద్ధిచెబితేనే రాజకీయ ప్రక్షాళన జరుగతది. ప్రజలకు మేలు జరుగుతది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ధన బేహారుల నుంచి మునుగోడును కాపాడాలని సూచించారు.
24 గంటల కరెంటు ఇస్తామని కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కోతలు కోశారని, ఇప్పుడు ఆ హామీ అమలుచేయకపోవటంతో ప్రజలు తిరగబడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. కర్ణాటక హస్తం పార్టీ నేతలే కొడంగల్, గద్వాలకు వచ్చి కాంగ్రెస్‌కు ఓటేయొద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. కర్ణాటక రైతులకు కనీసం 5 గంటలు కూడా కరెంటు ఇస్తలేరని విమర్శించారు. తెలంగాణ మినహా దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, ఆఖరికి ప్రధాని రాష్ట్రంలో కూడా సాధ్యంకావడం లేదని తెలిపారు. ఎన్నికల వేళ బీజేపీ నుంచి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు దిగుతారని, మనం చేసే పనుల్లో 10 శాతం కూడా చేయని వాళ్లు కూడా మనకు నీతులు చెప్తారని విమర్శించారు. ‘వాళ్ల దగ్గర మంచినీళ్లు దిక్కులేవు.. ఆ సన్నాసులొచ్చి మనకు చెప్తారు. వాళ్ల రాష్ట్రంలో కరెంటు లేక పొలాలు ఎండుతుంటే ఇక్కడకొచ్చి ఉపాన్యాసాలు, నీతులు చెప్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారతదేశానికే ఓ మార్గదర్శకంగా ఈ పదేండ్లలో తెలంగాణను తయారు చేశాం’ అని వివరించారు.
దళితబంధును నెహ్రూ కాలంలోనే అమలు చేసి ఉంటే.. ఇప్పుడు దళితులు రాజుల్లా బతికేటోళ్లు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నోట్ల నుంచి రాలేదు. దళితబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్.
అడ్డం పొడుగు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పాలించినప్పటికీ పాలమూరుకు పైసా లాభం చేయలేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిరంజన్ రెడ్డికన్నా, శ్రీనివాస్ గౌడ్కన్నా దొడ్డుగున్నోళ్లు, ఎత్తుగున్నోళ్లు మంత్రులు చాలామంది ఉండేవారు. ఒక్కడన్నా ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత బీఆర్ఎస్దే. నిరంజన్‌రెడ్డి కృషితో వనపర్తిలో బ్రహ్మాండంగా పనులు జరిగాయి. నిరంజన్‌రెడ్డి ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు. ఆయనను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించే బాధ్యత ప్రజలదే. నిరంజన్‌రెడ్డి కోరిన విధంగా పశువైద్య కళాశాల, వనపర్తి పట్టణం ఉత్తరంవైపు బైపాస్ రోడ్డు, ఇతర సదుపాయాలు కచ్చితంగా తెచ్చే బాధ్యత నాదే’ అని భరోసా ఇచ్చారు. వాల్మీకి సోదరుల గురించి రెండుసార్లు శాసనసభలో తీర్మానం చేసి పంపినా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంలేదని విమర్శించారు.
మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు 24 గంటలు కరెంటు ఇస్తామని కోతలు కోశారు. ఇప్పుడు 3 గంటలే ఇస్తుండటంతో అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. అక్కడి కాంగ్రెస్ నాయకులు కొడంగల్, గద్వాలకు వచ్చి కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని ధర్నాలు చేస్తున్నారు.
– సీఎం కేసీఆర్