హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరిపాకాన పడింది. పాలకపక్షంలో విభేదాలు బయటపడటం సహజమే అయినా, ఇప్పుడా పరిధి దాటి ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకొనే స్థాయికి వెళ్లిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంత్రి కొండా సురేఖ కార్యకలాపాల్లో ఆమె కుమార్తె కొండా సుస్మితాపటేల్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలతో ప్రభుత్వ నిఘా వర్గాలు ఉచ్చు బిగిస్తుండగా, మరోవైపు ముఖ్యనేత సోదరుల కదలికలు, లావాదేవీలపై సుస్మిత ప్రైవేట్ నిఘాను పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మధ్య నడుస్తున్న ఈ పరస్పర నిఘా రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ, దేవాదాయ, కాలుష్య నియంత్రణ మండలి విభాగాల్లో పరిపాలన అంతా ఆమె కుమార్తె సుస్మిత కనుసన్నల్లోనే నడిచిందని ముఖ్యనేత శిబిరం ఆరోపిస్తున్నది. శాఖల్లో జరిగిన భారీ బదిలీలు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఉద్యోగుల డిప్యుటేషన్ల వ్యవహారాల్లో సుస్మిత ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, సంబంధిత విభాగాల నుంచి ఏ కీలకమైన ఫైలు ముందుకు కదలాలన్నా సుస్మిత ఆమోదం తప్పనిసరిగా మారిందని, ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే నిర్ణయాలు అమలయ్యేవని ముఖ్యనేత శిబిరం ఆరోపిస్తున్నది.
డిపార్ట్మెంట్ హెడ్స్‌కు డీవో లెటర్లు పంపించి, ఫైళ్లను ప్రత్యేకంగా మంత్రి కార్యాలయానికి తెప్పించుకొనే వారని, భారీగా ముడుపులు అందిన వ్యవహారాలపైనే ఆమోదముద్రలు పడేవని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి మాజీ ప్రత్యేకాధికారి సుమంత్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. గత రెండున్నరేండ్లుగా ఓఎస్డీగా పనిచేసిన సుమంత్, పూర్తిగా సుస్మిత ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకునేవారనే ఆరోపణల మీద వివరాలు సేకరించాలని ఇంటెలిజెన్స్ విభాగాన్ని పురమాయించినట్టు తెలిసింది. ప్రభుత్వ శాఖల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో సుస్మిత ప్రమేయం ఏ మేరకు ఉన్నదనే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ నెల 3న ఢిల్లీకి వెళ్లేలోపు ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.

ముఖ్యనేత సోదరులపై నిఘా
సుస్మితాపటేల్ కూడా ముఖ్యనేత సోదరుల వ్యవహారాలపై ప్రైవేట్ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతంగా మారిన ముఖ్యనేత కుటుంబ సభ్యుల కదలికలు, వారు చకబెడుతున్న పనులు, వివిధ శాఖలతో వారికున్న సంబంధాలపై సమాచారాన్ని సుస్మిత సేకరించినట్టు చెప్తున్నారు. తన తల్లి శాఖలపై సీఎంవో పర్యవేక్షణ పెరుగడం, తమ నిర్ణయాలకు అడ్డంకులు ఎదురుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో, కౌంటర్ వ్యూహంగా ముఖ్యనేత సోదరుల లావాదేవీల చిట్టాను సిద్ధంచేసేందుకు సుస్మిత ప్రయత్నాలు సాగించారని ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ముఖ్యనేత సోదరుల్లో ఒకరు బెంగళూరుకు వెళ్లి హైదరాబాద్‌కు సంబంధించిన ఒక డీల్‌ను సెటిల్ చేయడానికి ప్రయత్నించగా, సుస్మిత పెట్టిన నిఘా వెంబడించినట్టు, దీంతో ముఖ్యనేత సోదరుడు అర్ధాంతరంగా తన ప్రయత్నం రద్దు చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్టు చెప్తున్నారు.