Secunderabad | మారేడ్‌పల్లి, అక్టోబర్ 19: సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయం పై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు ఇచ్చిన ‘సికింద్రాబాద్ బంద్’ పిలుపు శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పగా.. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడికి నిరసనగా కొన్ని ధార్మిక సంఘాలు శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ర్యాలీ నిర్వహించాయి.
సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ముత్యాలమ్మ ఆలయం వరకు సాగింది. అక్కడ ఆందోళనకారులు బైఠాయించి ధర్నాకు దిగారు. నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ అక్కడికి చేరుకొని వారిని ఆందోళన విరమించాలని కోరారు. ఇంతలో ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ స్థానికంగా ఉన్న మరో వర్గానికి చెందిన ప్రార్థనామందిరం వైపు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. పరిస్థితి చేజారిపోతుండడంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. దాడికి గురైన ఆలయంతోపాటు స్థానికంగా ఉన్న ఇతర ప్రార్ధనా మందిరాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
మెట్రోపొలిస్ హోటల్‌పై దాడి
ఆలయంపై దాడిచేసిన దుండగులు బసచేసిన మెట్రోపొలిస్ హోటల్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. పెద్దసంఖ్యలో ర్యాలీగా వచ్చిన ఆందోళనకారులు కుమ్మరిగూడ వద్దకు రాగానే రెండు గుంపులుగా విడిపోయి కొందరు ఆలయం వద్దకు, మరికొందరు మెట్రోపొలిస్ హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్ గేట్‌కు తాళం వేసి లోపలికి ఎవరూ రాకుండా బలగాలను మోహరించారు. దీంతో ఆందోళనకారులు హోటల్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హకీంపేట డిపోకు చెందిన బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు సికింద్రాబాద్‌లోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దీంతో నిత్యం రద్దీగా కనిపించే సికింద్రాబాద్, దాని పరసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.