హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రసద్ధిగాంచిన భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) పొందిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించటంలో కేంద్రం విఫలమైంది. ఇటీవల ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ పాలకమండలి 7వ సమావేశంలో వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతలో వోకల్ ఫర్ లోకల్‌ను మెరుగుపర్చుకోవడంపై రాష్ర్టాలు దృష్టిపెట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎక్కడా భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఉత్పత్తుల గురించి కనీసం ప్రస్తావించలేదు. మెరుగైన మార్కెటింగ్, సైప్లె చైన్ లాజిస్టిక్స్ సాంకేతికత అభివృద్ధి, స్టార్టప్స్‌ను ప్రోత్సహించేలా చర్యలు చేపడితే వోకల్ ఫర్ లోకల్ నినాదం నిజమయ్యేది.
ప్రచారం కల్పించటంలో కేంద్రం ఫెయిల్
దేశంలో జీఐ ఉత్పత్తులకు మూడు వేలకుపైగా ఆధీకృత వినియోగదారులు ఉన్నప్పటికీ, వాటాదారులకు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కడంలేదు. కేంద్ర ప్రభుత్వానికి జీఐ నమోదుపై ఉన్న శ్రద్ధ ఆ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం, వినియోగదారుల్లో చైతన్యం కలిగించడంపై లేదు. కేంద్రం పట్టించుకోకపోవడంతో జీఐ ఉత్పత్తులపై భారతీయుల్లో డిమాండ్ సృష్టించడమనేది ఉత్పత్తిదారులకు సవాల్‌గా మారింది. ప్రస్తుత స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగానైనా ‘ఘర్ ఘర్ జీఐ’ అనే ప్రచారోద్యమాన్ని చేపడితే మేలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో 400కుపైగా జీఐ ఉత్పత్తులు
భౌగోళిక గుర్తింపు అనేది ఒక ప్రత్యేక భౌగోళిక స్థానం నుంచి వచ్చిన ఉత్పత్తికి ఉపయోగించే గుర్తు, చిహ్నం, పేరు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆధీనంలో ఈ గుర్తింపు లభిస్తుంది. డార్జిలింగ్ టీ నుంచి హైదరాబాద్ లక్క గాజుల వరకు 15 ఏండ్లలో 920కిపైగా జీఐ దరఖాస్తులు రాగా, 400కుపైగా ఉత్పత్తులకు గుర్తింపు లభించింది.