Gajwel | గజ్వేల్, సెప్టెంబర్ 20: గజ్వేల్‌లో ముస్లింలు మరోసారి సీఎం కేసీఆర్‌కు జైకొట్టారు. కేసీఆర్ మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనుండటంతో లక్ష ఓట్ల మెజార్టీని కట్టబెడతామని గజ్వేల్ తంజిమ్ ఉల్ మసీద్ కమిటీ తరఫున ముస్లింలు తమ మద్దతు ప్రకటించారు. ఈ తీర్మాన పత్రాన్ని బుధవారం సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేతకు మరోసారి గజ్వేల్‌లో భారీ మెజార్టీ వచ్చేలా పనిచేస్తామని వారు వెల్లడించారు.
గజ్వేల్ పట్టణంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలను ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ షాదీముబారక్‌తో సాయం అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సహకారం.. మంత్రి హరీశ్‌రావు కృషితో గజ్వేల్‌లో షాదీఖాన నిర్మాణంతోపాటు మదీనా మసీద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకున్నట్టు చెప్పారు. ముస్లింల సంక్షేమం కోసం తపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి తప్పకుండా రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ యూసుఫ్, హజ్ కమిటీ డైరెక్టర్ జాఫర్‌ఖాన్, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విరాసత్ అలీ, కౌన్సిలర్లు రహీం, షాహనాజ్ సమీర్, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, షారీఫా ఉమర్ పాల్గొన్నారు.