Musi Demolitions | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘మూసీ జోలికి వెళ్లడం సాధ్యం కాదు. డబుల్ బెడ్రూంలు కేటాయించినప్పటికీ వారంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ వసతులు ఏమీ బాగా లేవు. తాగునీటి సమస్య, లిఫ్ట్ పనిచేయకపోవడం.. అపరిశుభ్ర వాతావరణం ఉందని బాధితులు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. రెక్కల కష్టంపై ఆధారపడే వాళ్లు రోజుకు పైఅంతస్థులు ఎక్కడం దిగడం కష్టంగా మారింది. బాల్కనీలో గ్రిల్స్ లేకపోవడం కూడా ప్రమాదకరంగా ఉంది. కిరాణా దుకాణాలు కూడా అందుబాటులో లేవు.’ ఇలాంటి సమస్యలు ఉన్నాయని అధికారులు రిపోర్ట్ రెడీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో దఫా కూల్చివేతలు సాధ్యం కాదని అధికారులు కరాఖండిగా సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఇందులో భాగంగానే సెర్ప్ సీఈవో దివ్యదేవరాజ్ ఆధ్వర్యంలో మూసీ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులంతా బుధవారం డబుల్ బెడ్రూంల్లో ఉంటున్న మూసీ బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నీ వసతులు ఉంటాయని బలవంతంగా ఇక్కడికి రప్పించి మా కష్టాలను అధికారులు పట్టించుకోవడంలేదని దివ్యదేవరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. మాకు మూసీ ఇండ్లే నయ్యమని అక్కడికి తిరిగి పంపించండి అని ఫాతిమా అనే మహిళ వేడుకున్నది. ఇండ్లు ఖాళీ చేస్తే ఇస్తామన్న పారితోషకం రూ.25వేలు ఇప్పటికీ అందలేదని వాపోయారు. బాధితుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ సమస్యల రిపోర్టును సర్కార్కు అందించినట్టు సమాచారం.
మూసీ బాధితులు తమ ఇండ్లు కూల్చొద్దని చేస్తున్న ఉద్యమాలు బలాన్ని పుంజుకుంటున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాలవాసులంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన విషయంపై ఆరా తీశారు. వారంతా తమ ఇండ్లను వదిలే ప్రసక్తే లేదని తీర్మానించుకున్నట్టు అధికారులు నోట్ చేసుకున్నారు.