Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో మట్టితో కూడిన ఇసుక కావడంతో ఆ ఇసుకతో కూడిన నిర్మాణాలు ఏ మేరకు సురక్షితమో చెప్పలేమని నిర్మాణరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఇసుకను నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ నది నుంచి తీసుకొస్తున్నట్టు పలువురు ఇసుక రవాణాదారులు చెప్తున్నారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి ఇసుకతో సమానంగా మూసీ ఇసుక ధరను నిర్ధారించడం విమర్శలకు తావిస్తున్నది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట్‌లో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. దొడ్డు ఇసుక టన్నుకు రూ.1,600, సన్న ఇసుక టన్నుకు రూ.1,800గా ధరలు నిర్ణయించింది.
మీ-సేవ కేంద్రాల్లో బుకింగ్ చార్జీలు, జీఎస్టీ, రవాణా ఖర్చులు కలిపి టన్నుకు రూ. 2,000-2,200 వరకు ఖర్చవుతున్నది. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఇసుక రవాణా చేయాలని టీజీఎండీసీ నిర్దేశిస్తుండగా, లారీల నిర్వాహకులు మాత్రం చౌటుప్పల్ సమీపంలో మూ సీ నుంచి ఇసుక తరలిస్తున్నారు. కొందరు లారీ యజమానులు ఇసుక అడ్డాలపై కాళేశ్వరం ఇసుక టన్నుకు రూ. 2,000 వరకు విక్రయిస్తుండగా, మట్టితో కూడిన మూసీ ఇసుకను ప్రభు త్వం ఇసుక బజార్లలో రూ. 2వేలకు పైగా విక్రయిస్తుండడం గమనార్హం. దీంతో ఇసుక బజార్లలోని ఇసుకకు డిమాండ్ లేకుండా పోయింది.
బడా బిల్డర్లు నేరుగా టీజీఎండీసీకి డీడీలు చెల్లించి కాళేశ్వరం నుంచి ఇసుకను తరలిస్తుండగా, చిన్నచిన్న నిర్మాణదారులు ఇసుక అడ్డాల్లో అధిక ధరతో ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టామని చెప్తున్న అధికారులు… ప్రజలకు మాత్రం అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుకను అందించడంలో విఫలమైనట్టు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.