Musi Beautification | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ కోసం అక్రమనిర్మాణాల పేరిట పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ్రయులుగా మారుస్తుంటే.. ఆ భూములను స్వాధీనం చేసుకునే వరకు పనులు మొదలుపెట్టకూడదనే యోచనలో అధికారులు ఉన్నారు. భూముల స్వాధీనం చేసుకున్న తర్వాతే పనులు మొదలవుతాయని, అప్పటివరకు కనీసం కాగితాలపై కూడా ప్రణాళికలు రూపొందించే ఆలోచనేలేదని తెలిసింది. దీనిని బట్టి మూసీ సుందరీకరణ మొదలుకావాలంటే మరో రెండేండ్లు ఆగాల్సిందే.
స్వాధీనమే అసలు సమస్య
మూసీ ప్రక్షాళన పర్వంలో 45 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, మతపరమైన స్థలాలను స్వాధీనం చేసుకోవడమే పెద్ద సవాలుగా మారనున్నది. ఇప్పటికే రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాల గుర్తింపుతో హైదరాబాద్ అల్లకల్లోలమైంది. ప్రాథమికంగా 16వేల నిర్మాణాలు అని చెప్పినా… మార్కింగ్ తర్వాత ఆ సంఖ్య 40వేలకు పైనే ఉందని అంచనాకు వచ్చారు. ఎఫ్ఆర్ఎల్ పేరిట గీసిన గీతలతో మూసీలో కొట్టుకుపోయే నిర్మాణాలు లక్షన్నరపైనే ఉంటుందనే వెల్లడైంది. ఇక బఫర్ జోన్ పరిధి కూడా నిర్ధారణ జరిగితే ఈ సంఖ్య మరో రెండు లక్షలు దాటే అవకాశం ఉందని మూసీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ఈ లెక్కన ప్రభుత్వ భూము ల్లో నివాసితులుగా ఉన్న వారి తరలింపు సులభంగానే జరిగింది.కానీ పట్టా భూము లు, అన్ని అనుమతులతో చేపట్టిన లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసుకుని, అధికారిక అపార్టుమెంట్లలో ఉంటున్న వారిని ఆస్తుల స్వాధీనం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే జనాలు తమ నివాసాలను కాపాడుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయి స్తున్నారు. దీంతో మూసీ ప్రక్షాళన మరింత జాప్యం కానున్నది. అయినా భూములు స్వాధీనం తర్వాతే మూసీ బ్యూటీఫికేషన్ పనులు చేపట్టాలని ఎంఆర్డీసీఎల్ అధికారులు భావిస్తున్నారు.