కవాడిగూడ, జనవరి 28 : కార్యకర్తలే పార్టీకి బలం అని ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముషీరాబాద్‌లోని కషీష్ హాల్లో భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మె ల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని 23 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని, ఇది కార్యకర్తల అండదండలతోనే సాధ్యమైందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా నిలువాలని సూచించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. కార్యకర్తల అండ, ప్రజల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీవిజయం సాధించినట్టు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
బీజేపీ నాయకుల మాయమాట లకు మోసపోవద్దని సూచించారు. త్వరలో కమిటీలు వేసి సీనియర్లకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీకోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మ, మాచర్ల పద్మజ, పార్టీ సీనియర్ నాయకుడు బింగి నవీన్, డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.