పెద్దపల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పం త్వరలోనే నెరవేరనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయినా.. ప్రాజెక్టు కట్టిన ఆ ప్రాంతంలోని రైతాంగానికి చుక్క నీరు సాగు దక్కని పరిస్థితుల్లో ఆ ప్రాంత భూమును సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పథకమే ముర్మూరు ఎత్తిపోతల (Murmur Lift). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ‘తలాపునా పారుతుంది గోదారి.. నీ సేలు నీసెలుకా ఎడారి.. రైతన్న నీ బతుకు అమాసా.. ఎన్టిపీసి చూస్తోంది తమాషా’ అని ఎలుగెత్తి చాటిన ముర్మూరు ముద్దు బిడ్డ మల్లా ఒజ్జల సాదాశిడి పాట యావత్ తెలంగాణను కదిలిస్తే.. దీపం కింద చీకటిలా.. తెలంగాణకే నిండుకుండగా ఉన్న ఎల్లంపల్లి ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు 2018వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 90కోట్ల వ్యయంతో ముర్మూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలాల్లోని 13,396ఎకరాల సాగు లక్ష్యంగా ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 2018లో అంతర్గాం మండలం ముర్మూరులో హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లె స్కీం ప్రారంభం సందర్భంగా ఈ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయం వరకూ దాదాపుగా 90శాతం పనులు పూర్తికాగా ఎన్నికల కోడ్‌తో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. తాజా ఈ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేసింది. గత మూడు రోజులుగా ఎత్తిపోతల ట్రయల్ రన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేసవి నుంచే సాగు నీటి అవసరాలను తీర్చే విధంగా చర్యలు చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ఎత్తిపోతల పథకాన్ని సాగుకు అంకితం చేయనుండటంతో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నది. జలస్వాప్నికుడు కేసీఆర్ దూరదృష్టితోనే తమ ప్రాంతం సస్యశ్యామలం కాబోతున్నదని రైతన్నల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పూర్వపు రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 2016వరకు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్టీపీసీకి నీళ ఇవ్వడంతో పాటుగా మంథని నియోజకవర్గంలోని గుండారం రిజర్వాయర్‌కు 2టీఎంసీల సాగు నీటిని అందించేందుకు శుక్రవారం పేట రిజర్వాయర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ రామగుండం నియోజకవర్గంలోని రామగుండం ప్రాంతాన్ని అప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయితే పూర్వపు రామగుండం మండల పరిధిలోని ఎల్లంపల్లి, ముర్మూర్, పొట్యాల, మద్దిర్యాల గ్రామాలు పూర్తిగా, వేంనూరు, కుక్కల గూడూరు గ్రామాలు పాక్షికంగా ఎల్లంపల్లి ప్రభావిత గ్రామాలుగా మిగిలాయి. కానీ ఏదైతే వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయో.. వాటి గురించి మాత్రం అప్పుడు పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో 2018లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముర్మూరులో హైదరాబాద్ సాగునీటి పథకం ప్రారంభం సందర్భంగా రూ. 90కోట్ల వ్యయంతో ముర్మూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి రైతుల సాగు నీటి కష్టాలను దూరం చేసిన జల స్వాప్నికుడిగా నిలిచారు.
రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం మండలాలలకు తలాపున గోదావరి ఉన్నప్పటికిని ఏటా సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతం కావడంతో సాగునీరు అంతంత మాత్రంగానే వచ్చేది. రెండు మండలాలల్లో ప్రతియేటా సుమారు 3నుంచి 5వేల ఎకరాలకు సాగునీరు లేక రైతులు బీళ్లు ఉంచుకునేవారు. 2018లో కేసిఆర్ ముందుచూపుతో రూ. 90కోట్ల వ్యయంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు లిఫ్ట్‌ల ద్వారా అంతర్గాం, పాలకుర్తి, పెద్దపల్లి మండలాలలకు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సుమారు 90శాతం పైపులైన్ పనులు పూర్తికాగా, గడిచిన ఏడాది కాలంగా పంపుహౌజ్‌లు నిర్మించారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ముర్మూర్ వద్ద ఒకటి, వేంనూర్ గ్రామం వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వద్ద ఒక పంపుహౌజ్ నిర్మించి ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో గల బండల వాగు డెలివరీ సిస్టర్న్‌కు గత వారం రోజులుగా ట్రయల్ రన్ చేస్తున్నారు. ముర్ముర్ పంపునుంచి అకేనపల్లి వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్17 లోకి నీరు విడుదల చేసి, బ్రాహ్మాణపల్లి, అకేనపల్లి, పొట్యాల, మద్దిర్యాల, ఎగ్లాస్పూర్, విస్సంపేట్ గ్రామాలకు సాగునీరు సరఫరా చేస్తున్నారు. వేంనూర్ పంపుహౌజ్ నుంచి పైపులైన్ ద్వారా ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో గల బండలవాగు ప్రాజెక్టులోకి నీటిని పంపుచేస్తున్నారు. బండలవాగు ప్రాజెక్టులో నీరు నిండితే కుక్కలగూడూర్ గ్రామంలోని 1250 ఎకరాలతోపాటు, పుట్నూర్, జయ్యారం, గుడిపల్లి శివారుతోపాటు, ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామాలకు సైతం వ్యవసాయ బావుల్లోకి నీరు సరఫరా అవుతుంది. ఈ రెండు లిఫ్ట్‌లతో 13,396ఎకరాల ఆయకట్టుకు మహర్ధశ పట్టనుంది.
తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూపుతో ఏర్పాటుచేసిన ముర్మూర్, బండలవాగు లిఫ్ట్‌ల మూలంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సాగునీరు అవసరం లేకుండా, ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటితోనే అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని 13,396 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనికితోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల్లో సైతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని సరఫరాచేసుకునే అవకాశం ఉంది. తద్వార రెండు మండలాలలకు కరువు నుంచి విముక్తి కలుగుతుంది. గతంలో తలాపున గోదావరి నది ఉన్నప్పటికిని సాగునీరు అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు రామగుండం నియోజకవర్గంలో నిర్మించినప్పటికిని రామగుండం రైతాంగానికి నీటి సరఫరా లేకుండే. హైద్రబాద్ మేట్రోవాటర్తోపాటు, ఎన్టీపీసీ థర్మల్‌కేంద్రం, మంథని గుండారం రిజర్వాయర్‌కు నీటి సరఫరా చేశారు తప్ప రామగుండం ప్రజలకు అందలేదు. అప్పటికి ముఖ్యమంత్రి కేసిఆర్ పట్టుబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రామగుండం నియోజవర్గ రైతాంగానికి సాగునీరు అందించాలని శంకుస్థాపన చేసిన మూర్మర్ లిఫ్ట్ ఇరిగేషన్ నేడు సిరుల పంట పండించనుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పట్టుదలతో ముర్మూర్ లిఫ్ట్పనులు 90శాతం పూర్తికాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది.
ఈ నీళ్ల కోసం మేం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నామని అంతర్గాం మండలం కుక్కల గూడూరు మాజీ సర్పంచ్ గోండ్ర చంద్రయ్య అన్నారు. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే మాకు మేలైతదనుకున్నం. మా బ్రతుకులు మారుతాయనుకున్నం. మాకు నీళ్లస్తయనుకున్నం. అట్ల రాలే. కేసీఆర్ సార్ కల గన్నడు. మాకు నీళ్లిస్త అన్నడు. ఆ కల నేడు నెరవేరబోతున్నది. చానా సంతోశంగా ఉన్నది. నేను కుక్కల గూడూరు సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఈ లిఫ్ట్కోసం చానా కష్టపడ్డ. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చాలా పని చేసిండు. కేసీఆర్ సార్, చందర్ అన్నల వల్లే ఇయ్యాల ఈ లిఫ్ట్ పూర్తయ్యిందని చెప్పారు.
ముర్మూరు ఎత్తిపోతలతోటి మా ఊరి చెరువు బండల వాగు నిండుతుందని ధర్మారం మండలం పైడిచింతలపల్లికి చెందిన గంధం తిరుపతి అన్నారు. బండల వాగు నిండితే మాకు పండుగే. మా ఊళ్లె ఉన్న బావులల్ల, బోర్లల్ల పుష్కలంగా నీళ్లుంటై. అదే ఇక్కడ శర్ల నీళ్లు ఎత్తిపోత్తన్నై అంటే సూసి పోతన్న. చానా సంతోశంగా ఉన్నది. ఎక్కడి ముర్మూరు ఇక్కడి పైడిచింతలపల్లి బండలవాగుల పోసుడంటే ఎంత అదృష్టం కావాలే. మా రైతులందరికీ మేలైతదని వెల్లడించారు.