Yellampally Project | పెద్దపల్లి, మార్చి 5(నమస్తే తెలంగాణ): ఎల్లంపల్లి ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పం త్వరలోనే నెరవేరనున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆ ప్రాంత ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఆ ప్రాజెక్టు ప్రాంతంలోని రైతాంగానికి చుక్క సాగునీరు దక్కని పరిస్థితి నెలకొన్నది. ఆ ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు నాడు కేసీఆర్ ముర్మూరు ఎత్తిపోతల పథకం చేపట్టారు. 2018లో రూ.90 కోట్ల వ్యయంతో ముర్మూరు ఎత్తిపోతల పథకానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని 13,396 ఎకరాలకు సాగునీరు, ఆయా ప్రాంతాల్లో తాగునీరు అందించాలని సంకల్పించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయం వరకూ ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు పూర్తవగా, ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయాయి. ప్రస్తుత ఆ పనులు పూర్తయ్యాయి. మూడురోజులుగా ఎత్తిపోతల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ వేసవి నుంచే సాగు నీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ఎత్తిపోతల పథకాన్ని సాగుకు అంకితం చేయనుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జలస్వాప్నికుడు కేసీఆర్ దూరదృష్టితోనే తమ ప్రాంతం సస్యశ్యామలం కాబోతున్నదని ఆ ప్రాంత అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
13,396 ఎకరాలకు సాగునీరు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు లిఫ్ట్‌ల ద్వారా అంతర్గాం, పాలకుర్తి, పెద్దపల్లి మండలాలకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ముర్మూర్ వద్ద ఒక పంప్‌హౌస్, వేంనూర్ గ్రామం వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్ వద్ద మరో పంపుహౌస్ నిర్మించారు. ముర్మూర్ పంపు నుంచి అకేనపల్లి వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్-17 కెనాల్లోకి నీటిని విడుదల చేసి, బ్రాహ్మణపల్లి, అకేనపల్లి, పొట్యాల, మద్దిర్యాల, ఎగ్లాస్పూర్, విస్సంపేట్ గ్రామాలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేంనూర్ పంపుహౌస్ నుంచి పైపులైన్ ద్వారా ధర్మారం మండలం పైడిచింతలపల్లిలోని బండలవాగు ప్రాజెక్టులోకి నీటిని పంపు చేస్తున్నారు.
బండలవాగు ప్రాజెక్టులో నీరు నిండితే కుక్కలగూడూర్ గ్రామంలోని 1,250 ఎకరాలతోపాటు, పుట్నూర్, జయ్యారం, గుడిపల్లి శివారుతోపాటు, ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామాలకు సైతం వ్యవసాయ బావుల్లోకి నీరు చేరుతుంది. ఈ రెండు లిఫ్ట్‌లతో 13,396 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుండగా, ప్రస్తుతం ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో బండలవాగు డెలివరీ సిస్టర్న్‌కు వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ సారే మాటిచ్చిండు
కేసీఆర్ సార్ కల గన్నడు. మాకు నీళ్లిస్త అన్నడు. ఆ కల నేడు నెరవేరబోతున్నది. చానా సంతోషంగా ఉన్నది. నేను కుక్కల గూడూరు సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఈ లిఫ్ట్కోసం చానా కష్టపడ్డ. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చాలా సాయంచేసిండు. కేసీఆర్ సార్, చందర్ అన్నల వల్లే ఇయ్యాల ఈ లిఫ్ట్ పూర్తయ్యింది.
– గోండ్ర చంద్రయ్య, మాజీ సర్పంచ్, కుక్కల గూడూరు, అంతర్గాం మండలం