శవాన్ని పూడ్చిపెట్టి కిడ్నాప్ డ్రామా
చార్మినార్, ఆగస్టు 22: ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని పూడ్చిపెట్టిన నిందితుడు కిడ్నాప్ నాటకమాడారు. చార్మినార్ ఏసీపీ భిక్షంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు ఎడ్ల మధుసూదన్‌రెడ్డి కొన్నేండ్ల క్రితం నగరానికి వలసవచ్చి కర్మాన్‌ఘాట్‌లో స్థిరపడ్డాడు. స్థానికంగా టిఫిన్‌సెంటర్ నిర్వహించే అతడికి చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పేట్లబుర్జులో నివసిస్తున్న కర్ణాటకకు చెందిన సంజయ్(42)తో స్నేహం కుదిరింది. ఇద్దరూ ఏపీ నుంచి గంజాయి తెచ్చి పలుప్రాంతాల్లో అమ్మకాలు సాగించేవాళ్లు. ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తడంతో సంజయ్‌ను దూరంపెడుతూ వచ్చిన మధుసూదన్‌రెడ్డి ఈనెల 19న అతడి వద్దకు కుటుంబసభ్యులకు చెప్పి బయటకెళ్లాడు. అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన సంజయ్.. తమను ఎవరో కిడ్నాప్ చేశారంటూ మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి చెప్పారు. దీంతో మధుసూదన్ భార్య మధులత చార్మినార్ పోలీసులను ఆశ్రయించింది. సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు డ్రైవర్ జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తన ఇంటికొచ్చిన మధుసూదన్‌ను సంగారెడ్డిలో ఓవ్యక్తి వద్ద డబ్బున్నదని, అక్కడకెళ్లి తెచ్చుకుందామని సంజయ్ తీసుకెళ్లాడు. మార్గమధ్యలోనే అతడ్ని హత్యచేసి కోహీర్ శివారులో పొలంలో పూడ్చిపెట్టినట్టు జగన్నాథ్ వెల్లడించారు. శవాన్ని వెలికితీసిన పోలీసులు సంజయ్ కోసం గాలిస్తున్నారు.