సూర్యాపేట, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలో కలకలం రేపిన కులోన్మాద హత్యలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాయనమ్మ కండ్లలో ఆనందం కోసమే మనుమండ్లు ప్రేమ పెండ్లి చేసుకున్న సోదరి భర్త కృష్ణను అతి కిరాతకంగా హత్య చేసినట్టు తేలింది. ఆ తరువాత కారులో శవాన్ని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్లి చూపించి ఆమె కండ్లల్లో ఆనందం చూసినట్టు నిందితులు చెప్పడం విస్మయానికి గురిచేస్తున్నది. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష ్ణ(32) అదే పట్టణంలోని పిల్లలమర్రికి చెందిన భార్గవి ప్రేమించుకున్నారు. కృష్ణది ఎస్సీ సామాజిక వర్గం కాగా, భార్గవి బీసీ. వీరి పెండ్లికి భార్గవి కుటుంబం ఒప్పుకోలేదు.
ఆరు నెలల క్రితం వీరిద్దరు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. దీంతో భార్గవి కుటుంబ సభ్యులు కృష్ణపై పగ పెంచుకున్నారు. ప్రధానంగా భార్గవి నాయనమ్మ కోట్ల బుచ్చమ్మ తన మనుమరాలు వద్దన్నా పెండ్లి చేసుకోవడంతో తరచూ మనుమండ్లను ఎగతాళి చేస్తూ మాట్లాడేది. వాడిని చంపితేనే మీరు సరైన మగాళ్లురా అంటూ వారిని ఉసి గొలిపేది. దీంతో భార్గవి సోదరులు కోట్ల నవీన్, వంశీ మరింత పగ పెంచుకొని కృష్ణను అంతమొందించాలని పథకం పన్నారు. స్నేహితుడైన బైరు మహేశ్ సహాయం తీసుకున్నారు. ఈ నెల 26న సాయంత్రం కృష్ణ్ణ తన స్కూటీపై మహేశ్ ఇంటికి రాగా ఇద్దరు కలిసి పిల్లలమర్రి శివారుకు వెళ్లి మందు తాగారు. మహేశ్ మద్యం తాగగా.. కృష్ణ కూల్‌డ్రింక్ మాత్రమే తీసుకున్నట్టు తెలిసింది. కొద్దిసేపటి తరువాత మహేశ్ పక్కకు వెళ్లి నవీన్, వంశీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇంటికి వెళ్దామని కృష్ణ స్కూటీ తీస్తుండగా మహేశ్ వెనుక కూర్చొని కృష్ణ గొంతుకు అడ్డంగా చేయి వేసి గట్టిగా నొక్కుతుండగా నవీన్, వంశీ పరుగెత్తుకొని వచ్చి రాళ్లతో కొట్టి హత్య చేశారు.
ఫంక్షన్లో ఉన్న నాయనమ్మ వద్దకు శవంతో..
హత్యానంతరం నవీన్ తన కారు ఢిక్కీలో కృష్ణ శవాన్ని ఉంచాడు. పాత సూర్యాపేటలో బంధువుల ఇంట్లో ఫంక్షన్లో ఉన్న వాళ్ల నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్లి శవాన్ని చూపించారు. అనంతరం స్నేహితుడు సాయిచరణ్‌కు మృతదేహాన్ని చూపించగా భయంతో పారిపోయాడు. నవీన్, వంశీ అక్కడి నుంచి సూర్యాపేటకు వచ్చి పిల్లలమర్రి గ్రామ శివారులోని చెరువు కట్ట చివరలో మూసీ కెనాల్ పక్కన శవాన్ని పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన కోట్ల నవీన్, వంశీ, వారి స్నేహితులు బైరు మహేశ్, సాయిచరణ్, హత్యకు కారకురాలైన వారి నాయనమ్మ బుచ్చమ్మను అరెస్టు చేశారు.