Komatireddy Rajagopal Reddy | చౌటుప్పల్/చండూర్, ఏప్రిల్ 13: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అధిష్ఠానం మంత్రిపదవి ఇస్తానంటుంటే.. సీనియర్‌నేత జానారెడ్డి అడ్డం పడుతున్నారని ఆరోపించారు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి.. ధ్రుతరాష్ర్టుడిలా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్ఠానానికి జానారెడ్డి రాసిన లేఖపైనా రాజ్‌గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. 30 ఏండ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్ఠానం చెప్పిందని, చాలాచోట్ల మంత్రులు ఇన్చార్జులుగా ఉన్న స్థానాలు కూడా కాంగ్రెస్ ఓడిపోయినా, తాను మాత్రం ఎమ్మెల్యేగా ఉండి, భువనగిరి ఎంపీ సీటు గెలిపించానని చెప్పారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ భారత క్రికెట్ జట్టులో ఒక ఇంట్లో నుంచి ఇద్దరు క్రికెటర్లు ఉన్నట్టే… మంత్రివర్గంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రులుంటే తప్పా? ప్రశ్నించారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీతో వస్తుందని చెప్పారు. చం డూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గంలోనూ రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపై వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇచ్చే సమయంలో జానారెడ్డి అధిష్ఠానానికి లెటర్ పెట్టడంతో ప్రక్రియ మళ్లీ మొదటకు వచ్చిందని అసంతృప్తి వ్యక్తంచేశారు.