సూర్యాపేట, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఇక్కడి ప్రజల ఊపు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు అనిపిస్తున్నది. రాజగోపాల్‌రెడ్డి 18 వేల కోట్ల కక్కుర్తి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పాపపు సొమ్ముతో ఇంటికి తులం బంగారం ఇస్తారట. అది తీసుకొని కారుకు ఓటెయ్యండి. మహిళలు వచ్చే నెల 3న ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటెయ్యండి’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే.. మునుగోడును దత్తత తీసుకొని, ఏడాదిన్నరలో అన్ని రంగాల్లో ముందుంచుతానని భరోసా ఇచ్చారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన చౌటుప్పల్‌లో మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, సీపీఎం, సీసీఐ నాయకులతో కలిసి భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మూడున్నరేండ్లుగా కోవర్టు రాజకీయాలు నడిపి.. గుజరాత్ గద్దలైన మోదీ, అమిత్‌షా రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వగానే రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ చెప్తే.. కేంద్రం 19 పైసలు కూడా ఇవ్వలేదని, పైగా ఫ్లోరోసిస్ పరిశోధన సంస్థను గుజరాత్‌కు తరలించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు నయా పైసా ఇవ్వని మోదీ.. రాజగోపాల్‌రెడ్డి కోసం రూ.18 వేల కోట్లు ఇచ్చారని విమర్శించారు. నాడు మోదీ ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని.. అవన్నీ రాజగోపాల్‌రెడ్డి ఖాతాలో పడ్డాయని దుయ్యబట్టారు.
ఎనిమిదిన్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల జాబితాలో వందకు పైనే ఉన్నాయని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసింది ఒక్కటంటే ఒక్కటి ఉన్నదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రసంగాలు, తిట్ల పురాణాలు తప్ప బీజేపీతో ఒరిగేదేమీ లేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ బాస్‌ల వద్ద తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఏం చేశామో ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా తెలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. నాడు అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం వెళ్లి పాములు, తేళ్లు కుట్టి, షాక్ కొట్టి చనిపోయిన రైతులు ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మర్రిగూడెం, మునుగోడు, నారాయణపురం, గట్టుప్పల్, చౌటుప్పల్‌లో ప్రతి ఒక్కరి బాధ తెలుసునని, ఇక్కడి వారికి పిల్లను ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉండేదని ఆవేదనచెందారు. మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా రూపుమాపింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 60 ఏండ్ల పాలనలో ఫ్లోరోసిస్ భూతాన్ని పెంచితే.. తాము నాలుగేండ్లలో అంతం చేశామని చెప్పారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లు మొదలు పెట్టి 60-70% పనులు పూర్తి చేశామని తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయన సమక్షంలో సీఎం కేసీఆర్‌ను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ‘మంత్రిగా కాదు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెప్తున్నా.. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నాదే’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేల మందికి పింఛన్లు, 9,900 మందికి కల్యాణలక్ష్మి, 9,500 మందికి కేసీఆర్ కిట్లు, 1,189 మందికి రైతుబీమా ఇచ్చినట్టు తెలిపారు. దండుమల్కాపూర్ పారిశ్రామికవాడలో 200 కంపెనీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని, ప్రజలను గాలికి వదిలేసినా తాము పట్టించుకున్నాం.. కాబట్టే సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని వివరించారు.
మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనడానికి రాజగోపాల్‌రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌తో గుజరాత్ పెద్దలు ఎర వేశారని, వారి డబ్బు మదం దించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డి వస్తే.. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరికైనా నయా పైసా పని చేసిందా? దమ్ముంటే చెప్పి ఓటడగమనండి అని సూచించారు. జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిగా 2016లో మర్రిగూడకు వచ్చి 300 పడకల దవాఖాన కడతానన్నారు.. కట్టారా? అని ప్రశ్నించారు.
‘రైతులకు రణమాఫీ చేయవద్దని మోదీ అంటడు. కానీ పెద్ద పెద్ద కంపెనీలకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేస్తడు. చేనేతపై పన్ను వేసిన మొదటి ప్రధాని మోదీ. ఒక దిక్కు కారుంది.. మరో దిక్కు బేకారు మాటలు, బేకారు పనులు తప్ప మరేంలేవు. బీజేపీ రాష్ట్ర నాయకుడు మసీదులు తవ్వుదామంటడు. శవమెళ్తే మీది.. శివమెళ్తే మాది అంటాడు. అసలీయన ఎంపీనా? ఇలాంటి చిల్లరగాళ్లను తరిమికొడదాం. మతం పేర చిల్లర రాజకీయాలకు బుద్ధి చెప్పాలి. కమ్యూనిస్టుల మద్దతుతో కూసుకుంట్ల మీ ముందుకు వచ్చారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించండి. రాజగోపాల్‌రెడ్డి నాలుగేండ్లలో చేయని అభివృద్ధిని 14 నెలల్లో చేసి చూపిస్తాం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, బీజేపీ విసిరిన రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఘనుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ రూ.40వేల కోట్లతో తెలంగాణలో విద్యుత్తు వెలుగులు నింపితే.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నారని, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే చౌటుప్పల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షో జనసంద్రమైంది. చౌటుప్పల్‌లో నిర్వహించిన ప్రచారంలో ఇసుక వేస్తే రాలనంతగా విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు.. యువత కేరింతలు మార్మోగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రి వివరిస్తూ ఇవి నిజ మా..కాదా అడిగినపుడల్లా అవునని సమాధానమిచ్చారు. ‘హర్సాల్ దో కరోడ్ ఉద్యోగాలని మోదీ మోసం చేసింది నిజామా? కాదా? అంటే నిజమేనని స్పందించారు.
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలకు చేసిన మోసాన్ని మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని, మెజారిటీ కోసమే పనిచేస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి వివరించారు. కేటీఆర్‌ను చూసేందుకు జనం పోటీపడ్డారు. వివిధ వర్గాలకు చెందిన నేతలు మంత్రికి శాలువాలు కప్పారు. చౌటుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు జ్ఞానేశ్వర్ కూతురు జ్యోతిర్మయి తన కిడ్డీ బ్యాంకును కేటీఆర్‌కు అందజేసింది. టీఆర్ఎస్ విజయానికి సంకేతంగా ఒక యువకుడు కత్తి (కరవాలం)ని బహూకరించారు.
మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి చర్ల్లగూడెం రిజర్వాయర్‌ను పూర్తి చేయించి, ఆ నీళ్లతో మీ కాళ్లు కడుగుతానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 2014లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే వందల కోట్లతో మునుగోడు అభివృద్ధికి బాటలు వేశానని వివరించారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే పదవిని వినియోగించుకొని పబ్బం గడుపుకొన్నారని విమర్శించారు.