పెద్దపల్లి టౌన్, నవంబర్ 3 : మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, సమాజానికి దిక్సూచిగా నిలువాలని రాజ్యసభ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లిలోని బంధంపల్లి స్వరూప గార్డెన్లో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎదగాలంటే ముందుగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. కాపుల్లో ఎన్ని విభేదాలున్నా పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు వచ్చి కలిసి పనిచేయాలని కోరారు.
బీసీలకు రాజకీయంలో సమన్యాయం జరగాలంటే కాపులు అన్ని కులాలను కలుపుకొని వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం కులాల లెక్క తెల్చేందుకు కుల గణన నిర్వహిస్తున్నదని, 80 వేల మంది ఎన్యుమరేటర్లు ద్వారా సర్వే చేస్తోందని, దీని వల్ల బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశాలున్నాయని వివరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లి మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు.