KCR | మల్లాపూర్, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ సర్కార్‌లో పేదోళ్లు గూడుతో పాటు ఉపాధి కూడా కోల్పోతున్నారు. సోమవారం కాప్రా మున్సిపల్ పరిధిలో మల్లాపూర్ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి శివ హోటల్ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను, షెడ్డులను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. మల్లాపూర్ నోమా ఫంక్షన్‌హాల్ ఎదుట ఓ తల్లీకొడుకు చెప్పుల దుకాణాన్ని కూల్చవద్దంటూ అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. తనుకు షుగర్, బీపీ ఉన్నదని ఇల్లు గడవడమే కష్టంగా ఉందని, దుకాణాన్ని కూల్చితే బతకలేనని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. కానీ అధికారులు చలించలేదు. ‘రెండు చేతులతో దండం పెడుతూ కేసీఆర్ సారూ ఎక్కడున్నావు. ఈ అన్యాయాన్ని చూడు. మమ్మల్మి మీరే కాపాడాలి. రేవంత్ మా బతుకును నాశనం చేస్తున్నాడు’ అంటూ తల్లీకొడుకులు విజప్తి చేశారు. జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశాలతో అక్రమణలను తొలగించినట్టు మున్సిపల్ సిబ్బంది తెలిపారు.
ఇప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తరు?
మహేశ్వరం, సెప్టెంబర్ 23 : మంఖాల్‌లోని ఇందిరమ్మ భూములు కార్పొరేట్ చెరలోకి వెళ్లిన వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత స్థానికంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ ముఖ్యనేత బంధువు వద్ద ఈ విషయం ప్రస్తావనకు రావటంతో ‘అయ్యేదేముంది? పోయేదేముంది?’.. రికార్డులు మారినయ్.. భూమి స్వాధీనమైంది.. ఇప్పుడు ఎవరు వస్తరు.. ఏం చేస్తరు?’ అన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై కొన్ని నెలల కిందట వేసిన విచారణ కమిటీ కూడా ఎటూ తేల్చదనే దృఢ సంకల్పంతో వారున్నట్టు స్పష్టమవుతున్నది. విచారణ కమిటీ కాలయాపన కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది.