Earthquake | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాలు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాదాపు 55 ఏండ్ల తరువాత దక్షిణాదిన తీవ్రస్థాయిలో భూమి కంపించింది. కొద్ది క్షణాల పాటు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.27 గంటల సమయంలో ఉభయ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్టు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కేంద్రానికి చుట్టూ 232 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం కనిపించినట్టు పేర్కొన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇంతకుముందు 2018లో చివరిసారిగా తెలంగాణలో భూమి కంపించింది. కాగా 5 కన్నా అధిక తీవ్రతతో దక్షిణ భారతంలో భూమి కంపించడం 55 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. మేడారంలో భూకంప కేంద్రం గుర్తింపు దాదాపు 55 ఏండ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి ఈ రేడియేషన్ ఉద్భవించినట్టు అధికారులు తెలిపారు. ఇంతకుముందు 1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. తాజాగా.. మళ్లీ అదే తీవ్రతతోనే ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. హైదరాబాద్, ఏటూరునాగారం, ములుగు, భద్రాచలం తదితర ప్రాంతాలు 3వ జోన్లో ఉన్నాయని తెలిపారు. ఉత్తర భారతం 5వ జోన్లో ఉన్నదని, అక్కడ వచ్చే భూకంపాలు ప్రమాదకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ 2వ జోన్లో ఉన్నదని, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని మణికొండ, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, అత్తాపూర్, నార్సింగి, రాజేంద్రనగర్, ఎర్రగడ్డ, సికింద్రాబాద్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, తార్నాక, బాచుపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, బోరబండ, శేరిలింగంపల్లి ఏరియాల్లో భూకంపం ప్రభా వం కనిపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హన్మకొండతోపాటు ఉమ్మడి ఖ మ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, చింతకాని, చర్ల, ఇల్లెందు, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, చెన్నారావుపేట మండల కేంద్రంలో భూమి కంపించింది.
అరేబియా సముద్రం, హిందూమహాసముద్రాల నుంచి వందల కిలోమీటర్ల వేగంతో ఎదురెదురుగా వచ్చిన గాలులు ఢీకొట్టిన ప్రాంతంలో టోర్నడో ఏర్పడుతుందని, అది ఈ ఏడాది ఆగస్టు 31న ములుగు జిల్లా మేడారంలో సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సుడిగాలి ప్రభావంతో మేడారం అరణ్యంలో సుమారు 60 వేల చెట్లు కూలిపోయాయి. ఇదే ప్రాంతం కేంద్రంగా ఇప్పుడు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని కొండలను.. నిర్మాణాలకు అవసరమైన కంకర కోసం అతిగా తోడేస్తుండటం పట్ల శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిలోని సహజ వనరులను అతిగా ధ్వంసం చేయడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలను ఎదురోవాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో.. భూ స్వభావానికి సంబంధించిన టెక్నికల్ అంశాలను విస్మరించకూడదని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలు సూచించారు.
దేశంలో 59 శాతం వివిధ తీవ్రతలతో భూకంపాలకు గురవుతాయన్నారు. భూకంపాలు సంభవించే ప్రాంతాలను, వాటి తీవ్రత దృష్ట్యా జోన్2, జోన్-3, జోన్-4, జోన్-5గా నాలుగు జోన్లుగా విభజించారు. జోన్-5 అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతం. అతితక్కువ తీవ్రత కలిగిన ప్రాంతం జోన్-2. ప్రస్తుతం తెలంగాణ అతి తక్కు స్థాయి భూకంపాలు సంభవించే జోన్-2లో ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉంది. ఇది భూకంపానికి కారణమవుతుంది. ఫాల్ట్ జోన్ అంటే భూమి అంతర్భాగంలో రెండు బ్లాకులు ఒకదానితో ఒకటి అకాస్మాత్తుగా జారిపోయే ప్రదేశం. ఒక్కోసారి అంతర్భాగంలో సర్దుబాటుల కారణంగా విడుదలయ్యే అపారమైన శక్తి భూకంపాలుగా వస్తుంది. గోదావరి బేసిన్లో పలు చోట్ల పగుళ్లు, లోపాటు ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే ఈ ప్రాంతంలో భూకంపాలకు కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గోదావరి నది పరీవాహక ప్రాంతం కావడంతో భూమిలో మెత్తదనం ఏర్పడటం, సింగరేణి గనుల తవ్వకం వల్ల భూతరంగాలు వేగంగా వ్యాపించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడటం వల్ల భూకంపం సంభవించి ఉండవచ్చని సీనియర్ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
సహజంగా నది పరీవాహక ప్రాంతాల్లో భూకంపం వచ్చినప్పుడు సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావం ఉంటుందని ఎన్జీఆర్ఐ అధికారి డాక్టర్ శేఖర్ చెప్పారు. అం దువల్లనే హైదరాబాద్లోని పలు చోట్ల భూమి కంపించిందని అన్నారు. ఇది గోదావరి ములు గు ప్రాంతంలో మొదలై స్వల్పంగా కృష్ణ నది వరకు పాకిందని చెప్పారు. తరువాత కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పగుళ్లు ఉన్న పాత భవనాలలో ఉండకపోవడం మంచిదని సూచించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గోదావరి నది పరీవాహక బేసిన్లో భూమిలోని భ్రంశాల్లో (పగుళ్లు) ఏమాత్రం స్థానచలనం జరిగినా భూకంప తరంగాలు ఉద్భవిస్తాయని, ఆ ఒత్తిడి రాళ్లలో కదలికలను ప్రేరేపించడంతో భూకంపాలు సంభవిస్తాయని కాకతీయ యూనివర్సిటీ జియాలజిస్ట్ మల్లికార్జున రెడ్డి అభిప్రాయపడ్డారు. ములుగు జిల్లాలో బుధవారం ఉదయం ఏర్పడిన భూకంపం భూపొరల్లోని రాళ్ల కదలికల వల్లేనని తెలిపారు. 5.3 తీవ్రతను బట్టి ములుగు భూకంపాన్ని టెక్టోనిక్ ఎర్త్ క్వేక్గా పరిగణించవచ్చని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) రిటైర్డ్ శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు. భూమి అంతర్భాగంలోని మాగ్మా నుంచి వచ్చే బ్రహ్మాండమైన ఒత్తిడితో భూఫలకల్లో కదలికలు ఏర్పడుతాయని, ఈ ఫోర్స్ వల్ల ఇండియన్ ప్లేట్ ఉత్తరదిశగా ఏటా 5 సెంటిమీటర్ల మేర కదులుతున్నట్టు గుర్తు చేశారు. దీని కారణంగా భూమి పొరల్లో ఫాల్ట్స్ (పగుళ్లు) ఏర్పడి భూకంపాలు వస్తున్నట్టు వెల్లడించారు.