ములుగు: ములుగు జిల్లాలో పులి హత్యకు సంబంధించిన కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు గొత్తికోయలను ములుగు ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పులిని హత్య చేసిన నిందితులు లింగాల గ్రామంలో ఉన్నారంటూ మంగళవారం రాత్రి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీసులు, అటవీ అధికారులు ఆ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
తాడ్వాయ్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ శివ్ అశీష్ సింగ్, ఎఫ్ఆర్వో శిరీష, మేడారం ఎఫ్ఆర్వో గౌతమ్ రెడ్డి, లింగాల ఎఫ్ఆర్వో సతీష్ ఇతర సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసిన గుత్తికోయల్లో మడకం రాము, ముచకి అంధా, మడకం సతీష్, కొవాసి ఇడుమా, ముచకి రాజ్‌కుమార్ ఉన్నారు. వారిలో నలుగురు నిందితులు పులిచర్మం ఒలుచడంలో, అనంతరం సంబంధిత వ్యర్థాలను ధ్వంసం చేయడంతో కీలకపాత్ర పోషించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
నిందితుల నుంచి పులి హత్య కోసం ఉపయోగించిన కత్తులు, గొడ్డళ్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడుతామని తెలిపారు.