Mulugu | లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని గ్రామసభలోనే పురుగుల మందు తాగిన రైతు నాగేశ్వరరావు (నాగయ్య) మృతిచెందారు. పది రోజులకు పైగా ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన అతను బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో గత నెల 23వ తేదీన గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులు అర్హుల జాబితాను చదివి వినిపించారు. దీంతో కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు (నాగయ్య) అనే దళితుడు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని అధికారులను నిలదీశాడు. వారు పొంతనలేని సమాధానం చెప్పి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో అన్ని అర్హతలూ ఉన్న తన పేరును జాబితాలో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల్లో అర్హులు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా వస్తాయని ప్రశ్నించాడు.
గత ఏడాది తన ఇల్లు కాలిపోయిందని ఫొటోలను అధికారులకు చూపెడుతూనే ‘నాకు రాకపోయినా నా చావుతోనైనా గ్రామంలోని అర్హులకు పథకాలు ఇవ్వాలి’ అని అధికారులకు చెప్పి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు మందు డబ్బాను లాక్కోగా, అక్కడే ఉన్న తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో వనిత వాసనకు ముక్కు మూసుకొని పక్కవెళ్లిపోయారు. అక్కడే ఉన్న ఇతర అధికారులు, గ్రామస్తులు నాగయ్యను అంబులెన్సులో ఏటూరునాగారం సీఎచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశాడు.