ములుగు, జూన్16(నమస్తే తెలంగాణ) : ములుగు డీఈవో జూనియర్ అసిస్టెంట్‌తో కలిసి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు 2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదానికిగురై సెలవులోఉన్నాడు. అక్టోబర్ 1న డీఈవో కార్యాలయానికి వచ్చి జాయినింగ్ రిపోర్టు ఇవ్వగా డీఈవో పాణిని రూ.20వేలు ఇస్తేనే రీ పోస్టింగ్ ఇస్తానని, ఆర్డర్ తయారు చేసినందుకు జూనియర్ అసిస్టెంట్ దిలీప్‌కుమార్‌కు రూ.5వేలు ఇవ్వాలని చెప్పారు.
వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు రాగా డీఈవో డబ్బులు డిమాండ్ చేశారు. జీతం రావడంలేదని ప్రాధేయ పడటంతో తనకు రూ.15వేలు, దిలీప్‌కు రూ.5వేలు ఇవ్వాలని చెప్పారు. సోమవారం డీఈవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడి నుంచి 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఈవో, జూనియర్ అసిస్టెంట్‌పై కేసు నమోదుచేసి, వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.
ములుగు డీఈవో సస్పెన్షన్
అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ ములుగు జిల్లా డీఈవో పాణిని అధికారులు సస్పెండ్‌చేశారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆయన్ను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులిచ్చారు.