ములుగు, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు గురుకులంలోని మూడో అంతస్థు నుంచి జారిపడిన దళిత విద్యార్థిని నిమ్స్‌లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జంగాలపల్లికి చెందిన కొయ్యడ కార్తీకశ్రీ 9వ తరగతి చదువుతున్నది. ఈ నెల 9న గురుకులం భవనం మీదినుంచి ప్రమాదవశాత్తు పడిపోవటంతో పక్కటెములతో పాటు నడుము విరిగింది. విద్యార్థిని పడిపోవటాన్ని చూసి స్థానికులు చెప్పాకే గురుకుల యాజమాన్యం పొదల్లో పడిపోయిన కార్తీకను మొదట ములుగు దవాఖానకు, తర్వాత వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు సిబ్బంది తరలించారు.
వైద్యానికి భారీగా ఖర్చవుతుందనటంతో మెరుగైన చికిత్సను సాకుగా చూపి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి వదిలేశారు. భర్త కొయ్యడ రాజు మృతితో ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న సుమలతకు ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. కూలిపనులు చేసుకొనే ఆమె చేతిలో చిల్లిగవ్వ లేక భోరున విలపిస్తున్నది. ప్రభుత్వం ఆందుకుంటేనే తన బిడ్డ ప్రాణాలు దక్కుతాయని, మంత్రి సీతక్క సాయం చేయాలని కోరుతున్నది. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు విద్యార్థినికి ఆపరేషన్ చేయాలని సూచించగా బిల్లు ఎవరు చెల్లించాలనేది తేలలేదు. గురుకులంలో ఘటన జరిగినా, తమకేమీ సంబంధం లేదన్నట్టుగా సుమలతతో గురుకుల యాజమాన్యం లేఖ రాయించుకున్నట్టు ప్రచారమవుతున్నది. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆపరేషన్ చేస్తామని వైద్యులు తెలిపారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థిని తల్లి నుంచి ఎలాంటి లేఖ రాయించుకోలేదని స్పష్టంచేశారు.