కవాడిగూడ, మార్చి 25: పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక్షుడు జీ పాండు డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమంలో (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయ తీ సిబ్బంది వేతనాలకు బడ్జెట్ కేటాయించి.. గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు. పంచాయతీ సిబ్బందిని కూడా రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. జీవోనంబర్ 51ని సవరించి మ ల్టీపర్సస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్స్ కల్పించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో పేర్కొన్న హామీలు అమలు చేయాలని అన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు సు ధాకర్, గణపతిరెడ్డి, యాదయ్య, వెంకటయ్య, మహేశ్, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.