హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు సాధారణమయ్యాయి. పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అనధికారింగా కోతలు అమలవుతున్నాయి. దీంతో జనాలకు అవస్థలు తప్పడంలేదు. ఒకవైపు ఎండలు మండుతుండగా, మరోవైపు విద్యుత్తు కటకటతో జనం అల్లాడుతున్నారు. ప్రత్యేకించి ఈ వారంలో కోతలు మరింత ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో వరి పంటకోతలు పూర్తయి.. వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ గృహ, పారిశ్రామిక రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తును సక్రమంగా అందించలేకపోతున్నది. ఎక్కడైనా వీఐపీ కార్యక్రమాలుంటే డిస్కంల అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కోతల్లేకుండా చూస్తున్నారు. జనాలను మాత్రం గాలికొదిలేశారు.
ఇటీవల ప్రతిరోజు వర్షం పడుతుండటం, ఉష్ణోగ్రతలు తగ్గడంతో విద్యుత్తు వినియోగం తగ్గిపోయింది. గతనెలలో గరిష్ఠ డిమాండ్ 17వేల మెగావాట్లు నమోదుకాగా, ప్రస్తుతం 9,297 మెగావాట్లకు చేరింది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలో విద్యుత్తు డిమాండ్ 9.8 శాతం పెరిగింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ తగ్గినా కరెంట్ కోతలు సర్వసాధారణమవ్వడంతో జనం అవస్థలు పడుతున్నారు.