Mulki Movement | తెలంగాణ ఎలా వచ్చిందో కండ్లముందున్న చరిత్ర. అదే చరిత్ర పుటలను ఓ 58 ఏండ్లు వెనక్కి తిప్పితే.. 1956లో ఉన్న తెలంగాణను ఎవరు ఊడగొట్టారో తెలుస్తుంది. ఇంకో నాలుగేండ్లు వెనక్కి వెళ్తే విలీన ప్రక్రియ వెనుక ఉన్న కాంగ్రెస్ కుయుక్తులు అర్థమవుతాయి. హైదరాబాద్ స్టేట్‌ను నాన్ ముల్కీల ఎస్టేట్‌గా మార్చి స్థానికులను ఏమార్చిన కాంగ్రెస్ వైఖరికి తొలి నిరసన కేంద్రం వరంగల్. పోరుఖిల్లాలో మొదలైన ‘ముల్కీ ఉద్యమం’.. కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ఉసురుతీసి అణచి వేసిందనేది చారిత్రక వాస్తవం.
27 జూన్ 1952 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభా సమావేశాలు ‘పోలీసు చర్య తర్వాత… పర్మినెంట్ ఉద్యోగాలలో నాన్ – ముల్కీలను ప్రభుత్వం నియమించిందా? ఎంతమందిని నియమించారు? నాన్ ముల్కీలను నియమించడానికి కారణం ఏమిటి?’
– జి. హనుమంతరావు, ఎమ్మెల్యే
‘నాన్ ముల్కీలకు (స్థానికేతరులకు) శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది నిజమే. ఒక్క పోలీస్ శాఖలనే 4,981 మంది నాన్ ముల్కీలను(స్థానికేతరులను) నియమించినం. అండ్ల 3,111 మంది ఆంధ్రోళ్లు (మదరాసీలు) ఉన్నరు. ఈ నాన్ ముల్కీలల్ల మెట్రిక్యులేషన్ కూడా సదువనోళ్లు 407 మంది ఉన్నరు. ఏ విద్యార్హతలూ లేనోళ్లు 399 మంది ఉన్నరు. మిగిలినోళ్ల చదువుల సంగతి తెల్వదు.
– బూర్గుల రామకృష్ణారావు,హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి
‘ఒత్తిళ్ల కారణంగానే పోలీస్ శాఖలో నాన్ ముల్కీలకు ఉద్యోగాలు ఇచ్చామ’ని ముఖ్యమంత్రి ఒప్పుకోలును 1952 జూన్ 28న గోలకొండ పత్రిక ప్రచురించింది. కాంగ్రెస్ పాల కుల అండతో ఇక్కడ ఉన్నత పదవుల్లో కుదురుకున్న నాన్ ముల్కీలు తమ బంధువులకు బోగస్ ముల్కీ పత్రాలు సృష్టించి.. ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇదేదో తెలియక చేసింది కాదు. తెలంగాణకు కాంగ్రెస్ తెలిసి చేసిన ద్రోహం. ఆంధ్రను హైదరాబాద్‌లో విలీనం చేయాలని అక్కడి మేధావులు, రాజకీయ నేతల డిమాండ్లు వినిపిస్తున్న రోజులవి. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఆ దిశగా యోచిస్తున్న తరుణమది. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి.. తెలంగాణను పణంగా పెట్టిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్‌కే చెల్లింది.
తెలంగాణలో విద్యావంతులు లేరన్న కారణం చూపుతూ పరాయి ప్రాంతం వారికి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చింది ఈ కాంగ్రెస్సే! ఒక్క పోలీసు శాఖలో జరిగిన నియామకాల్లో వేలమంది నాన్ ముల్కీలు ఉండటం ఆ పార్టీ తీరుకు నిదర్శనం. ‘ఒత్తిళ్ల కారణంగానే పోలీస్ శాఖలో నాన్ ముల్కీలకు ఉద్యోగాలు ఇచ్చామ’ని ముఖ్యమంత్రి ఒప్పుకొన్నాడని 1952 జూన్ 28న గోలకొండ పత్రిక ప్రచురించింది. కాంగ్రెస్ పాలకుల అండతో ఇక్కడ ఉన్నత పదవుల్లో కుదురుకున్న నాన్ ముల్కీలు.. అధికార బలంతో తమ బంధువులను రప్పించి, బోగస్ ముల్కీ పత్రాలు సృష్టించి.. ప్రతి శాఖలోనూ వందల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. విద్యాశాఖలో ఇన్స్పెక్టర్గా చేరిన పార్థసారథి ఇలా వచ్చినవాడే! ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదం పురుడు పోసుకోవడానికి ఆ అధికారి దుశ్చర్యలు నాంది పలికాయి. వరంగల్ డివిజన్లో పనిచేస్తున్న ఆయన ఒకేసారి 100 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. దీనిపై విద్యార్థులు నిరసించినా.. కాంగ్రెస్ సర్కార్ కిక్కురుమనలేదు.
విద్యాశాఖ, వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ పార్థసారథి బోగస్ ముల్కీ సర్టిఫికెట్తో కొలువులో చేరాడని ప్రభుత్వానికి హయగ్రీవాచారి ఫిర్యాదు చేశారు. పార్థసారథి 100 మందికిపైగా ఉపాధ్యాయులను ఒకేసారి బదిలీ చేశాడు. హనుమకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్లోఉపాధ్యాయులూ బదిలీ అయినవాళ్లలో ఉన్నారు. వాళ్ల ఇంక్రిమెంట్‌ను ఆపాడు. పార్థసారథిని ఆ పాఠశాల ప్రిన్సిపల్ రషీద్ ఉల్ హసన్ ఆక్షేపించాడు. రషీద్‌పై కక్ష పెంచుకున్న పార్థసారథి.. వేధింపులు మొదలుపెట్టాడు. ఆ బాధలకు రషీద్ గుండె ఆగి కన్నుమూశాడు. పార్థసారథి తప్పుడు నిర్ణయాలపై విద్యార్థులు జూన్ 28న ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. జూలై 24న డిప్యూటీ డైరెక్టర్ విచారణ చేపట్టాడు. ఈ సందర్భంగా ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గైర్ ముల్కీ గో బ్యాక్’ అంటూ విద్యార్థులు హనుమకొండ చౌరస్తా నుంచి సుబేదారి వరకు వరంగల్‌లో ఊరేగింపు తీశారు. ముల్కీ ఉద్యమ చరిత్రలో తొలి నిరసనగా వరంగల్ విద్యార్థి ప్రదర్శన చరిత్రకెక్కింది.
నాన్ ముల్కీ పోరాటం దావానలంలా వరంగల్ జిల్లా మొత్తం పాకింది. ఆగస్టు 1న ఖమ్మం మెట్టు, 2న మహబూబాబాద్, 3న మధిర, 4న ఇల్లెందు పట్టణాల్లో ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ నినాదాలతో ఊరేగింపులు తీశారు. నాన్ ముల్కీలను తప్పించాలని, ఉపాధ్యాయ బదిలీలను నిలిపివేయాలని విద్యార్థి కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రిని కోరింది. సబ్-కమిటీ వేస్తామని బూర్గుల తప్పించుకున్నారు .ఆగస్టు 22న ముఖ్యమంత్రి వరంగల్ వచ్చాడు. ‘మాటిచ్చినవ్, మర్చిపోయినవ్. ఏంది నీ సంగతి’ అన్న తీరుగ విద్యార్థి కార్యాచరణ కమిటీ సీఎంని నిలదీసింది. ‘హైదరాబాద్ పోంగనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి, సబ్-కమిటీ నియమిస్తానని హామీ ఇచ్చాడు. ఆగస్టు 27 వరకు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తామని, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని విద్యార్థులు గడువుపెట్టారు.
విద్యార్థి ఉద్యమం వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు విస్తరించింది. ముల్కీ రూల్స్ అమలు చేయాలని ఆగస్టు 24న బొల్లారంలో విద్యార్థి సభ జరిగింది. ఆగస్టు 26న నిర్వహించ తలపెట్టిన విద్యార్థి సమ్మెకు ఆ సమావేశం మద్దతు పలికింది. విద్యార్థుల డిమాండ్లను పరిశీలించేందుకు సబ్ కమిటీని నియమిస్తున్నట్టు ఆగస్టు 26 రాత్రి ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకున్నారు. అది విద్యార్థులకు చేరలేదు. ఆగస్టు 27న వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఔరంగాబాద్, ఖమ్మం, మధిర, మహబూబాబాద్‌లో విద్యార్థి సమ్మె విజయవంతమైంది. ఆ సమ్మెతో ముల్కీ ఉద్యమం నల్లగొండకు విస్తరించింది. సబ్ కమిటీ వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ సమ్మెను విరమించారు.
నాటి సమ్మెలో పాల్గొనవద్దని వరంగల్ కలెక్టర్ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. కానీ, విద్యార్థులు సమ్మెను విజయవంతం చేశారు. సమ్మెకు నాయకత్వం వహించిన విద్యార్థులపై ఆగస్టు 28న వరంగల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆగస్టు 29న వేలాది మంది విద్యార్థులు ఊరేగింపు తీశారు. సిటీ కాలేజీ నుంచి బయలుదేరి అఫ్జల్‌గంజ్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, గోషామహల్, చాదర్‌ఘాట్ హైస్కూల్ వరకు జులూస్ కొనసాగింది. ఊరేగింపు గురించి తెలుసుకున్న పాతబస్తీ విద్యార్థులు ఆగస్టు 30న తరగతులు బహిష్కరించారు. ‘మదరాసీస్ గో బ్యాక్, గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదాలు చేశారు. అప్పటి నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు తరగతుల బహిష్కరణ, సభలు, ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 1952 ఆగస్టు 29న వేలమంది విద్యార్థులు సిటీ కాలేజీ నుంచి బయలుదేరి అబిడ్స్ వరకు ఊరేగింపు తీశారు. హైదరాబాద్ వీధుల్లో ‘మదరాసీస్ గో బ్యాక్, గైర్ ముల్కీ గో బ్యాక్’ నినాదాలతో జులూస్ తీస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వరంగల్లు, హైదరాబాద్‌లో విద్యార్థులపై లాఠీఛార్జ్‌లను నిరసిస్తూ తెలంగాణ, మరఠ్వాడా, గుల్బర్గా, బీదర్, ఔరంగాబాద్ ప్రాంతాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. విద్యార్థి ఉద్యమం హైదరాబాద్ స్టేట్ మొత్తం విస్తరించింది. రోజురోజుకూ ముల్కీ ఉద్యమానికి పెరుగుతున్న ఆదరణకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేతకు సిద్ధమైంది. ‘నాన్ ముల్కీ ఉద్యమంలో మీ పిల్లలు పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆందోళనలో పాల్గొని, ఆస్తులు విధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకుంటం’ అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శివ్ కుమార్ లాల్ కరపత్రం విడుదల చేశిండు. సెప్టెంబరు 2న ఆ కరపత్రం పత్రికల్లో అచ్చయింది.